Ads
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ తన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారాహి పైకి ఎక్కి తొలి స్పీచ్ ఇచ్చారు. తనను చూసేందుకు తరలి వచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఆలయంలో పూజా కార్యక్రమం తర్వాత అక్కడికి దగ్గరలోని రిసార్ట్ లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈసారి 7-14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో పొత్తులకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. అయితే.. తెలంగాణలో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. వాటిలో కూడా 25 నుంచి 40 అసెంబ్లీ సీట్లలో బరిలోకి దిగేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఒకటికి రెండుసార్లు పర్యటిస్తానని చెప్పారు పవన్.
Advertisement
కొన్ని కారణాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని.. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు పవన్. తన రాజకీయ ప్రస్థానంతోపాటే.. జనసేన పుట్టుక కూడా తెలంగాణ గడ్డపై నుంచే మొదలైందని గుర్తు చేశారు. పరిమిత స్థాయిలోనే పోటీ చేస్తూ ఆట మొదలు పెడుతామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలన్నది తన కోరికని చెప్పారు పవన్.
పార్టీ నేతలతో సమావేశం తర్వాత ధర్మపురి వెళ్లారు జనసేనాని. అక్కడ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని.. అనుష్టుప్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆలయంలోకి చేరుకోగానే మొదట యమధర్మరాజుకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ధర్మపురిలోకి ఎంటర్ కాగానే.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పవన్ కు ఘన స్వాగతం పలికారు. ఇక మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా దర్శించుకోనున్నారు జనసేనాని.