Advertisement
బయట ఉండే శత్రువుల కంటే… మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువని చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని మంగళగిరిలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న జనసేనాని.. జగన్ సర్కార్ పై మండిపడ్డారు. మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రూ.20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ.15 వేల కోట్లను ఖర్చు చేసిందని… రంగుల కోసమే రూ.21,500 కోట్లను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. నిధులను దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో ఎస్పీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెబుతుంటే బాధేస్తోందని.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు.
Advertisement
ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు పవన్. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు. జై భీమ్ అనే పదం నా గుండెల్లో నిలిచిపోయిందని, చట్టాలు చేయడం కాదు.. ఆచరణలో చేసే మనసు ఉండాలని చెప్పారు. రాజధాని భూ సమీకరణ సమయంలో అసైన్డ్ రైతులకు న్యాయం చేయగలిగామని.. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములున్న దళితులకు న్యాయం జరిగేలా చూశామని తెలిపారు.
Advertisement
సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాకుండా సమగ్రంగా చూడాలని చెప్పారు పవన్. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని చెప్పారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని.. తాను కూడా వివక్షకు గురయ్యానని వివరించారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు నీళ్లు ఇవ్వడానికి ఒక బ్రిటీష్ మహిళ నిరాకరించిందని అన్నారు పవన్.