Advertisement
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ సంచలనంగా మారగా.. పదో తరగతి పేపర్ కూడా బయటకు రావడం కలకలం రేపింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు తెలుగు పేపర్ పరీక్ష జరిగింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. గ్రేస్ సమయంతో కలిపి.. 9.45 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే.. 9.37 గంటలకు తెలుగు ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది.
Advertisement
పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకు పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పేపర్ ముందే లీక్ అయిందా? లేకపోతే పరీక్ష ప్రారంభమైన తర్వాతే బయటకొచ్చిందా? అనే అనుమానాల చుట్టూ రకరకాల కథనాలు బయటకొచ్చాయి. అయితే.. విద్యాశాఖ రంగంలోకి దిగి పోలీసుల సాయంతో విచారణ మొదలుపెట్టగా.. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇది జరిగిందని గుర్తించారు. బందెప్ప అనే టీచర్ పేపర్ ను ఫోటో తీసి వాట్సాప్ లో వేరేవాళ్లకు ఫార్వార్డ్ చేశాడని తేల్చారు.
ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో విద్యాశాఖ వివరణ ఇచ్చింది. తర్వాతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ కేంద్రాల్లో ఉన్నందున.. ఇది లీక్ కాదని విద్యా శాఖ తెలిపింది. బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ మాత్రమేనని పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో తప్పులు జరగలేదని తెలిపారు.
Advertisement
అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. రాష్ట్రంలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని బండి సంజయ్ అన్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీక్ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని.. తెలంగాణలో పరీక్షలు వస్తే లీక్ ల జాతర నడుస్తోందని విమర్శించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులను శిక్షించి, ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు. లక్షల మంది రాసే టెన్త్ పేపర్ కూడా లీక్ అవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అసలు ఈ ప్రశ్నా పత్రాలు ఎలా లీకవుతాయని, ప్రభుత్వం ఇంత అలసత్వంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు.
మరోవైపు ఈ ఘటనలో బందెప్ప సహా నలుగురిపై చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్. ఫొటో తీసిన బందెప్పతో పాటు ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్ ను సస్పెండ్ చేశారు.