Advertisement
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. అంతేకాదు.. భవిష్యత్ కార్యాచరణపై హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. విజయవాడలోని నోవాటెల్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు చంద్రబాబు. విశాఖ ఘటనల నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చ సాగింది. ప్రతిపక్షాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇరువురు మాట్లాడుకున్నారు.
Advertisement
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఇద్దరు నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ వంటి నీచమైన పార్టీని తన జీవితంలోనే చూడలేదని అన్నారు. 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని.. అందరం కలుద్దామని పవన్ కల్యాణ్ ని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడదామన్నారు.
Advertisement
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలనూ కలుపుకెళ్తామని తెలిపారు. ముందుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ఆ తర్వాతే రాజకీయాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ప్రజా సమస్యలు ప్రస్తావించే పార్టీల గొంతు నొక్కేస్తే ఎలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్న పవన్.. జనసైనికులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
వీరిద్దరి భేటీతో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఈ రెండు పార్టీలు కలవడం ఖాయమని కథలు అల్లేస్తున్నారు. అయితే.. చంద్రబాబు, పవన్ వ్యాఖ్యల తర్వాత వరుసబెట్టి వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నారనేది అర్థం అవుతోందని విమర్శించారు. నిజానికి టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి భారీ నష్టం తప్పదు. 2014 ఎన్నికలే దీనికి ఉదాహరణ. 2019 సమయంలో వేర్వేరుగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలు నష్టపోయి వైసీపీకి లాభం చేకూరింది. చాలా చోట్ల టీడీపీ, జనసేన ఓట్లు కలిపితే వైసీపీకి వచ్చిన చాలా తక్కువగా అనిపించాయి. ఇప్పుడు మళ్లీ ఈ రెండు పార్టీలు కలిస్తే గనక జగన్ పార్టీకి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.
Also Read: వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్