Advertisement
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఎంత ప్రశాంతంగా ముగిశాయో.. ఫలితాల సమయంలోనూ అదే ప్రశాంతత కొనసాగింది. శశిథరూర్ కాస్త అసహనం వ్యక్తం చేసినా.. ఖర్గేతో కలిసి నడుస్తానని చెప్పారు. దాదాపు 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో మల్లికార్జున ఖర్గే విజయం సాధించగా.. పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన జీవిత ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.
Advertisement
1942, జులై 21న కర్ణాటకలోని బీదర్ లో జన్మించారు ఖర్గే. గుల్బర్గాలోని నూతన్ విద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత అక్కడి ప్రభుత్వ కళాశాలలోనే డిగ్రీ చదివారు. గుల్బర్గాలోని సేత్ శంకర్ లాల్ లహోటీ కాలేజీలో లా పూర్తి చేశారు. గుల్బర్గా ప్రభుత్వ కళాశాల విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. లాయర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కార్మిక సంఘాల పక్షాన కేసులను వాదించారు. ఈక్రమంలోనే లేబర్ యూనియన్ లీడర్ గా ఎన్నికయ్యారు. అలా 1969లో గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Advertisement
1972లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగారు. 2009లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఖర్గే. యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఖర్గే 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవి చూశారు.
దక్షిణ భారతదేశం నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన ఆరవ నేతగా ఖర్గే చరిత్రలో నిలిచిపోయారు. అంతకు ముందు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, కె కామరాజ్, ఎస్ నిజలింగప్ప, పీవీ నర్సింహారావు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.