Advertisement
మీరంతా శ్రీమంతుడు సినిమా చూసే ఉంటారుగా. మహేష్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. అందరికీ అండగా నిలబడతాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇదే స్ఫూర్తితో పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహేష్ కూడా రియల్ గా అలాగే చేశాడు. అయితే.. మునుగోడు కేంద్రంగా దత్తత రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
అధికార టీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం చాలా ముఖ్యం. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ బైపోల్ లో గెలిస్తేనే తర్వాతి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. లేదంటే తిప్పలు తప్పవు. దీంతో గులాబీ నేతలు గెలుపు వ్యూహాల్లో తలమునకలయ్యారు. కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఎన్నికకు సమయం దగ్గర పడేకొద్దీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అలా ఒకరి తర్వాత ఒకరు గ్రామాల దత్తత ప్రకటన చేస్తున్నారు.
Advertisement
నియోజకవర్గంలో దీన్ని స్టార్ట్ చేసింది మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా అక్కడకు వెళ్లిన ఆయన.. ఏకంగా నియోజకవర్గాన్నే దత్తత తీసుకుంటానని అన్నారు. అంతేకాదు నెలకోసారి వచ్చి దగ్గరుండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. మిగిలిన నేతలు కూడా ఇదే రాగం అందుకున్నారు.
మునుగోడులో మంత్రులు, ఇతర నేతలకు గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. సారు చెప్పిన టార్గెట్ ని రీచ్ కావడం కోసం పోటాపోటీగా దత్తత ప్రకటనలకు దిగారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ గెలిస్తే దత్తత తీసకుంటామని హామీ ఇస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎర్రబెల్లి దయాకర్ కూడా చండూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటానన్నారు. శ్రీనివాస్ గౌడ్ అయితే.. కేటీఆర్ నెక్ట్స్ సీఎం అవుతారని నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నారని చెబుతున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ నేతల దత్తత రాజకీయాలపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మనుగోడు నియోజకవర్గ ప్రజలు ఏమైనా అనాథలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారని నిలదీస్తున్నారు.