Advertisement
మునుగోడు.. మునుగోడు.. ముునుగోడు.. తెలంగాణలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఏ దిక్కుకు వెళ్లినా దీనిపైనే చర్చ సాగుతోంది. విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరు..? గెలిచిన పార్టీకి లాభమా? ప్రతిపక్ష పార్టీ గెలిస్తే.. అధికార మార్పిడి ఖాయమా? ఇలా అనేక రకాల ప్రశ్నలతో అన్ని చోట్ల జోరుగా రకరకాలచర్చలు సాగుతున్నాయి. ఎన్నిక దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. పనిలో పనిగా తిట్ల దండకాన్ని అందుకుని.. ఒకరిపై ఒకరు బుదరజల్లుకుంటున్నారు. అసలు.. మునుగోడులో గెలిచేదెవరు..? జనాలు ఏమనుకుంటున్నారు..? ఎవరికి పట్టం కట్టనున్నారు..? ఇలా అనేక ప్రశ్నలపై కూపీ లాగుతున్నాయి సర్వే సంస్థలు. అలా.. మునుగోడు ప్రజల మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది ‘‘COPACT’’ సంస్థ. ఏపార్టీకి ఎంతమంది అనుకూలంగా ఉన్నారో మండలాల వారీగా ఉన్న ఓట్లతో సర్వే నిర్వహించింది.
Advertisement
మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఉన్నాయి. అవి మునుగోడు, చండూరు, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపూర్, నాంపల్లి, చౌటుప్పల్, గట్టుప్పల్. వీటిలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ యాదాద్రి జిల్లాలో ఉండగా.. మిగిలిన ఐదు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. వీటన్నింటిపై లోతైన సర్వే నిర్వహించింది ‘‘COPACT’’ సంస్థ.
సర్వే వివరాలు.. మండలాల వారీగా..!
1. మునుగోడు
అన్ని పార్టీల చూపు దీనిపై ఎక్కువ ఉంది. ఎందుకంటే నియోజకవర్గ కేంద్రం ఇదే. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు, గతంలో ఇక్కడే బహిరంగ సభలు పెట్టాయి. దీన్నిబట్టి అన్ని ప్రధాన పార్టీలు ఈ మండలంపైనే దృష్టి పెట్టాయని అర్థం అవుతోంది. ఈ మండలంలో అతిపెద్ద మేజర్ గ్రామపంచాయతీలుగా కొరటికల్, చీకటి మామిడిలు ఉంటాయి. కొరటికల్ లో ఎస్సీ కమ్యూనిటీ అత్యధికం. దీంట్లో అందరూ ఒకరోజు టీఆర్ఎస్ లో, ఒకరోజు బీజేపీలో చేరుతున్నారు. కాబట్టి రోజురోజుకీ రాజకీయం మారుతుంది. ఈ కొరటికల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభావం కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ మండలంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా రోజురోజుకి మారుతోంది. కాబట్టి చివరి వరకు కూడా ఈ మండలంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది.
మునుగోడు మండలం మొత్తం: 36,000 ఓట్లు
గ్రామ పంచాయతీలు – 27
2. చండూరు
మునుగోడు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో చండూరు ఒకటి. ఈ మున్సిపాలిటీలో యువత ఎక్కువగా ఉంటారు. వీరందరూ 75శాతం బీజేపీ వైపు ఉన్నారు. చండూరులో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఒక్క ఓటుకి ఐదు నుంచి పదివేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంది కానీ గ్రామాలలో టీఆర్ఎస్ హవా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. రోజురోజుకి ఇక్కడ ఈ రెండు పార్టీలలో పోటీ పెరుగుతూ వస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీలో చేరి కండువా కప్పుకున్నా ఒకరికి 10,000 నుంచి 15,000 ఇస్తున్నారు. చండూరు ప్రాంతంలో నల్గొండ నియోజకవర్గ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ బెల్టు మొత్తం దానికి ఆనుకొని ఉంటుంది. ఎన్నికల ఫలితాలలో ఈ మండలం చాలా కీలకంగా మారనుంది.
మున్సి పాలిటీ-9950 ఓట్లు
రూరల్ -19,500 ఓట్లు
3. మర్రిగూడ
చర్లగూడెం, శివన్న గూడెం ప్రాజెక్టులతో ఈ మండలంలో రెండు గ్రామాలకు సంబంధించినవారు భూములు కోల్పోయారు. వీళ్లకు రావలసిన నష్టపరిహారం పూర్తిగా చెల్లించలేదు. కానీ, ప్రస్తుతం వీరికి ప్రభుత్వం నుంచి భూ నిర్వాసితులకు తమ అకౌంట్లో డబ్బులు వేసి ఫ్రీజ్ చేసి ఉంచారు. వీరికి ప్రభుత్వం పైన వ్యతిరేకతని తగ్గించుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ, కొంతమంది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లనే తమకు నష్టపరిహారం అందింది అని బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు బీజేపీ వైపు తిప్పుకునే అవకాశం ఉంది. కానీ, టీఆర్ఎస్… కాంగ్రెస్ ని తమ ప్రత్యామ్నాయమని వ్యతిరేక ఓటుని చీల్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ మండలానికి చెందిన లంకలపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంచార్జ్ గా ఉన్నారు. కాబట్టి ఈ మండలంలో టీఆర్ఎస్ ముందంజలోనే ఉంది. అలాగే డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మండలంలో ఉన్న గ్రామానికి ముఖ్యమంత్రి ఇంచార్జ్ గా ఉన్నందుకు టీఆర్ఎస్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.
మండలం మొత్తం :27,800 ఓట్లు
గ్రామ పంచాయతీలు -18
Advertisement
4. సంస్థాన్ నారాయణపూర్
ఈ మండలంలో తండాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే డబ్బు మద్యం ప్రభావితం చేస్తాయి. మండల పరిసర ప్రాంతాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి ఓటు బ్యాంకు చాలా కీలకంగా మారనుంది. ఈ మండలంలో సర్వేల్, పుట్టపాక, నారాయణపురం మేజర్ గ్రామపంచాయతీలు. ఈ ప్రాంతాలలో టీఆర్ఎస్-40%, కాంగ్రెస్-28%, బీజేపీ-25%, డీఎస్పీ, బీఎస్పీ -5%, మిగతా-2% ప్రస్తుతం ఉన్నాయి. ఈ ప్రాంతంలో డబ్బు ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ కి బీజేపీకి ఇప్పుడున్న వ్యత్యాసం చివరి వరకు ఉండకపోవచ్చు.
మండలం మొత్తం -36,069 ఓట్లు
గ్రామ పంచాయతీలు -31, తండాలు -13
మండల కేంద్రంలో -7000 పైచిలుకు ఓట్లు
5. నాంపల్లి
ఈ మండలం కొంచెం వెనుకబడినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలకి రాజకీయ అవగాహన చాలా తక్కువ. ఎస్టీ లంబాడీలు ఎక్కువగా ఉంటారు. ఈ తండాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి త్రిముఖ పోటీ ఉంటుంది. మండలంలో అధికంగా డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ మండలంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉంది. చివరి వరకు కాంగ్రెస్ బీఎస్పీ, డీఎస్పీలలో ఉన్న ఓటు బ్యాంకు చాలా కీలకంగా మారనుంది. ప్రతీరోజు ఇక్కడ అన్ని పార్టీల నేతలు చేస్తున్న ప్రచారం కారణంగా రోడ్ షోల కారణంగా రాజకీయం మారుతూ వస్తోంది. కానీ, చివరి ఒకరోజులో పంచే డబ్బు ప్రధానంగా మారుతుంది.
మండలం మొత్తం : 35,000 ఓట్లు
6. చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో ఇది కూడా ఒకటి. ఈ మండలం మొత్తం జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది. హైదరాబాద్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ప్రభావం ఈ మండలం పై ఉంటుంది. మునుగోడు నియోజకవర్గం మొత్తంలో అత్యధిక ఓటర్లు ఈ మండలంలోని ఎక్కువగా ఉంటారు. కాబట్టి అన్ని పార్టీలు ప్రధానంగా దీనిపైనే ఫోకస్ చేస్తాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రాంతంలో కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. ఆ కంపెనీల ప్రభావం ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఓటర్లపై కచ్చితంగా ఉంటుంది. మండలంలో ఉన్న ప్రతి గ్రామాల్లో రోజురోజుకి రాజకీయం మారుతుంది. ముఖ్యంగా ప్రజలు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయించుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలు ఈ సామాజిక వర్గంపై దృష్టి సారించాయి. దాంట్లో 40%- బీజేపీ, 38%- టీఆర్ఎస్, 20%- కాంగ్రెస్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ఈ తేడా చివరి వరకు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాంగ్రెస్ అభ్యర్థి డబ్బు పంచలేకపోతే ఓటు బ్యాంకు ఆ రెండు పార్టీలు తీసుకునే అవకాశం ఉంది.
మున్సి పాలిటీ -25,493 ఓట్లు
రూరల్ -37,500 ఓట్లు
7. గట్టుప్పల్
ఈ మండలం మునుగోడు నియోజకవర్గంలోని అతి చిన్నది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతనే దీన్ని మండలంగా ప్రకటించారు. మొత్తం ఆరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో మండలం చేయాలని గ్రామస్తులు ధర్నా చేశారు. కాబట్టి దీన్ని గట్టుప్పల్ మండలంగా ప్రకటించడంతో టీఆర్ఎస్ కి అనుకూలంగా మారిపోయింది. కలిపిన ఆరు గ్రామాలు మేజర్ గ్రామపంచాయతీలు. ఎక్కువగా, కమ్మ గూడెం అనే గ్రామంలో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. వారు ఎక్కువగా టీఆర్ఎస్ వైపు ఉంటారు. అలాగే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినందుకే గట్టుపల్ ని మండలంగా ప్రకటించారని కొంతమంది బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మారే రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ మండలంలో కూడా టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది.
మండలం మొత్తం -16,282 ఓట్లు
గ్రామ పంచాయతీలు -6