Advertisement
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తల పెట్టిన భారత్ జోడో యాత్ర మూడు రాష్ట్రాల్లో పూర్తయింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ను దాటుకుని తెలంగాణ గడ్డపై ఆయన కాలు మోపారు. వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే కొద్ది దూరమే నడిచి మూడు రోజులపాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు రాహుల్ గాంధీ.
Advertisement
దీపావళి పండగ, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారోత్సం సందర్భంగా మూడు రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చారు రాహుల్. 24, 25, 26 తేదీల్లో ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. తిరిగి అక్టోబర్ 27 ఉదయం గూడెంబెల్లూరు నుంచి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 375 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగనుంది.
Advertisement
అయితే.. తెలంగాణలోకి రాహుల్ ఎంట్రీ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. పలువురు ముఖ్య నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొందరు నాయకులు కిందపడి పోయారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మహేష్ కుమార్ గౌడ్ లకు గాయాలయ్యాయి. పొన్నాల మోచేతికి గాయమవగా రక్తం కారింది. మాజీ మంత్రి గీతారెడ్డి ఆయనకు కట్టు కట్టారు. ప్రాథమిక చికిత్స కోసం పొన్నాలను ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు.
రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు హస్తం నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికుల నుంచి వినతులు స్వీకరించేలా.. స్థానిక, రాష్ట్ర సమస్యలు ఆయన ప్రస్తావించేలా ప్లాన్స్ వేశారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను వివరించనున్నారు. నవంబర్ 7న రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ముగించుకుని మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది.