Advertisement
మునుగోడు ఉప ఎన్నిక టైమ్ దగ్గర పడే కొద్దీ పార్టీల్లో కలవరం పెరుగుతోంది. ఓటర్లు ఎటు వైపు ఉన్నారో తెలియని పరిస్థితి. కానీ, గెలిచేది తామంటే తాము అని సొంత డబ్బా కొట్టేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతా తమదే విజయం అని మాట్లాతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా దాన్నే వల్లెవేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. రోజులు గడిచే కొద్దీ అది రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. సరిగ్గా ఇదే టైమ్ లో ఎన్నికల ప్రచారానికి అగ్ర నేతలు వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
భారత్ జోడో యాత్ర తెలంగాణకు చేరింది. మూడు రోజులు బ్రేక్ ఇచ్చినా 27 నుంచి మళ్లీ మొదలవుతుంది. కచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికపై రాహుల్ చేత కాంగ్రెస్ శ్రేణులు వ్యాఖ్యలు చేయించే అవకాశం ఉంది. ప్రచారానికి రాలేకపోయినా.. పాదయాత్రలో పార్టీ శ్రేణులకు, మునుగోడు ప్రజలకు ఆయన వినతులు చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఇక ప్రచార పర్వం ముగిసే చివరి రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రంగంలోకి దిగుతున్నారు.
Advertisement
ఈనెల 30న మునుగోడు ప్రచారానికి కేసీఆర్ రానున్నారని సమాచారం. ఆరోజు చండూరులో బహిరంగ సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్ సభ ఏర్పాట్లలో మునిగిపోయినట్లు మాట్లాడుకుంటున్నారు. అయితే.. కేసీఆర్ ప్రచారం తర్వాతి రోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు వస్తున్నారు. దీంతో ఉప ఎన్నికల హీట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కేసీఆర్ ముందు రోజు సభ కాబట్టి.. ఆయన చేసే వ్యాఖ్యలకు నడ్డా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు.
వచ్చే నెల 1తో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో 31న మునుగోడులో ప్రచార సభకు నడ్డాను చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తున్నారు కమలనాథులు. 30న కేసీఆర్ సభ ఉండడం, మరుసటి రోజే నడ్డా సభ జరగనుండడంతో బైపోల్ ప్రచార ముగింపు రసవత్తరంగా మారుతుందని అనుకుంటున్నారు. మూడు రోజుల క్రితం దండు మల్కాపూర్ లో నడ్డాకు సమాధి కట్టడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఇద్దరు బీజేపీ నేతలు గులాబీ గూటికి చేరారు. ఈక్రమంలో టీఆర్ఎస్ టార్గెట్ గా నడ్డా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.