Advertisement
దళిత బంధును అనుచరుల బంధుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత మంది దళితులకు ఈ పథకం ఇచ్చారో వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం మాట మీద నిలబడే వ్యక్తి కాదని.. గడిచిన ఎనిమిదేళ్లుగా అన్నీ మోసాలే చేస్తున్నారని విమర్శించారు.
Advertisement
సీఎం కుటుంబం తప్ప ఇప్పటి వరకు ఏ పేద కుటుంబం కూడా బాగుపడలేదన్నారు షర్మిల. అక్రమంగా సంపాదించిన డబ్బులతో కేసీఆర్ విమానాలు కొంటున్నారని ఆయనకు ఓటేస్తే చరిత్ర క్షమించదని మండిపడ్డారు. తెలంగాణలో అప్పు లేని రైతు లేనే లేడని.. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు.
Advertisement
కుంభకోణం అనే పదానికి ఫాదర్ కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. ‘పాపడం’ కథ చెప్పి మహిళలను కోటేశ్వరులను చేస్తామని చెప్పారు కదా ఏమయ్యింది అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. పథకాల పేర్లు చెప్తూ మోసం చేయడమే కానీ.. ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపణలు చేశారు. చివరకు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదని మండిపడ్డారు.
టీఆర్ఎస్ నాయకులకు అధికార గర్వం తలకెక్కిందని, ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. రాష్ట్రానికి అప్పులు మిగిల్చి.. కేసీఆర్ మాత్రం సంపాదించుకున్నారని ఆరోపించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి.. ఉన్న భూములను గుంజుకుని కేసులు పెడుతున్నారని ఎద్దేవ చేశారు షర్మిల. ఇష్టానికి ఇచ్చుకునేది దళిత బంధు ఎలా అవుతుందని ప్రశ్నించారు.