Advertisement
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో పార్టీలు మొండి వైఖరితో ముందుకెళ్తున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. అందులో ధనం చాలా కీలక భూమిక పోషిస్తోంది. విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని, మద్యాన్నిఏరులై పారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం రంగంలోకి దిగారు. మునుగడు ధనప్రవాహంపై సమరశంఖం పూరించారు.
Advertisement
మునుగోడులో అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుద్ద భవన్ లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో కోదండరాం మౌన ప్రదర్శనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని.. రాజ్యంగ బద్ధంగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.
Advertisement
ఇప్పటికైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు కోదండరాం. పార్టీల నేతలు నువ్వు ఒక్కటి ఇస్తే నేను రెండిస్తా అంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారని మండిపడ్డారు. డబ్బులు, మద్యాన్ని ఏరులై పారిస్తూ.. నోట్ల కట్టలతో ఓట్లు రాల్చుకునేందుకు చూస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని తెలిపారు.
మునుగోడు బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. 6న ఫలితాన్ని వెల్లడిస్తారు. టీఆర్ఎస్ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు.