Advertisement
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే కేంద్రీకృతమై ఉంది. తెలంగాణకు సంబంధించి సెమీ ఫైనల్ గా భావిస్తున్న మునుగోడులో ప్రముఖంగా త్రిముఖ పోరు ఉన్నప్పటికీ, పోటీ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్యేనని భావిస్తున్నారు. అటు, కాంగ్రెస్ కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. ఓవైపు తిట్టుకుంటూనే గెలుపు తమదంటే తమదని తెగ ఊదరగొడుతున్నారు. ఏదిఏమైనా, రోజుకో రకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, మునుగోడు ఫలితం చాలా ఉత్కంఠగా మారింది.
Advertisement
COPACT విశ్లేషణ ప్రకారం.. మునుగోడు మూడ్ ఇదే!
గతంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చాలా కచ్చితమైన విశ్లేషణలు అందించిన COPACT సంస్థ మునుగోడు మూడ్ ను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే ఈ నెల 22 నుండీ 29వ తేదీ దాకా నియోజకవర్గంలోని ఏడు మండలాలలో దాదాపు మూడువేల మంది సాధారణ ఓటర్లతో COPACT ప్రతినిధులు మాట్లాడారు. వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మునుగోడులో పాగా ఎవరిది అని తేల్చే క్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
మండలాలవారీగా పార్టీల బలాబలాలు పరిశీలిస్తే!
1. చండూరు:
మున్సిపాలిటీ ఓట్లు-9,950, రూరల్ ఓట్లు- 19,500
చండూరు మండలంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగానే ఉంది. కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయి టీఆర్ఎస్, బీజేపీల గ్రాఫ్ పెరిగింది. డబ్బు పంపిణీ ప్రభావం ఉన్నప్పటికీ, ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకుంటున్న ప్రజలు ఎవరికి ఓటు వేయాలో స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఓట్లు చీల్చుకోవటానికి టీఆర్ఎస్ భారీగానే శ్రమిస్తున్నా మండలంలో మాత్రం ఓటర్లు బీజేపీవైపే కాస్త మొగ్గు చూపుతున్నట్టు COPACT సర్వేలో వెల్లడైంది.
2. చౌటుప్పల్:
మున్సిపాలిటీ ఓట్లు- 25,493, రూరల్- 37,500
ఈ ఎన్నికలో చాలా కీలకంగా భావించే చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 25,493 ఓట్లున్నాయి. ఈ ఓట్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ఇక్కడ ప్రతి ఇంటినీ టచ్ చేశాయి.ఈ మున్సిపాలిటీ మాత్రమే కాకుండా మండలం అంతా ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ రెండు పార్టీలు కనీసం రెండు సార్లు మొత్తం చుట్టేశాయి. చౌటుప్పల్ లో మొదటి రెండు స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఓట్లు సమానంగా పంచుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే గతంలో ఇక్కడి కాంగ్రెస్ ఓటు బ్యాంకును రెండు పార్టీలు సమానంగా పంచుకునేలా కనిపిస్తోంది.
3. గట్టుప్పల్:
మొత్తం ఓట్లు- 16,282
ప్రధానంగా మూడు పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ, రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడ్డ మండలం కావటంతో ఇక్కడ టీఆర్ఎస్.. బీజేపీ కంటే కొద్దిగా మాత్రమే వెనుకబడింది. బీజేపీకి 50శాతం ఓట్లు వస్తే, టీఆర్ఎస్ కు 45శాతం, ఇతరులకు 5శాతం వచ్చే అవకాశం ఉంది.
Advertisement
4. మర్రిగూడ:
మొత్తం ఓట్లు- 27,800
గతంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉన్న మండలం ఇది. ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ ముందు నుంచీ బలంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. రెండు పార్టీలు యువత టార్గెట్ గా పనిచేస్తున్నా, అధికార పార్టీ నుంచి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఇక్కడ ప్రతిరోజూ ఇంటింటికీ చికెన్, మటన్ సప్లై జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ టీఆర్ఎస్ 5శాతం ముందంజలోనే ఉందని చెప్పొచ్చు. కానీ చివరివరకూ అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పే పరిస్థితి లేదు.
5. మునుగోడు:
మొత్తం ఓట్లు – 36,000
ఈ మండలంలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ సమాన అవకాశాలతో ఉన్నాయి. అయినా ఇక్కడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటం, ఆయనకు పర్సనల్ గా ఫ్యాన్స్ ఉండటం రాజగోపాల్ రెడ్డికే లాభించే అవకాశం ఉంది. మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ పార్టీ నాయకత్వం సరిగ్గా లేకపోవటం, పార్టీలోనే తనకు జరిగిన అవమానంతో వెంకట్ రెడ్డి మౌనంగా ఉండటం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారనుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. అటు కమ్యూనిస్టు ప్రభావం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ వాళ్లు ఇప్పటికే టీఆర్ఎస్ తో కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు టీఆర్ఎస్ కే పడ్డా, గతంలోని బీజేపీ ఓటు బ్యాంకు రాజగోపాల్ రెడ్డికి కలిసివస్తుంది.
6. నాంపల్లి:
మొత్తం ఓట్లు – 35,000
ఇది మునుగోడు నియోజకవర్గంలో కాస్త వెనుకబడిన ప్రాంతమనే చెప్పాలి. తండాలు కాస్త ఎక్కువగా ఉండే మండలం ఇది. అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదని టీఆర్ఎస్ పై కాస్త వ్యతిరేకత ఉన్నా, వివిధ పథకాల ప్రభావం కూడా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నా, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను ఎవరు చీల్చుకుంటారనేదే ప్రధానాంశం.
7. నారాయణపురం:
మొత్తం ఓట్లు – 36,069
ఈ మండలంపై మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రభావం బాగానే ఉండటం టీఆర్ఎస్ కు కలిసి వస్తోంది. ఆయనకున్న మంచిపేరు, ఆయన క్యాడర్ వల్ల ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉంది. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే మండలం కావటంతో టీఆర్ఎస్ ఈ మండలం ఓట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే ఇక్కడ తండాలు కూడా ఎక్కువ కావటంతో డబ్బు, మద్యం ప్రభావం బాగా కనిపిస్తోంది. అయితే మొదటి నుంచీ కాంగ్రెస్ ప్రభావం బాగా ఉన్న మండలం కావటంతో తండాల్లో ఆపార్టీకి అనుకూల వాతావరణం కూడా ఉంది. మొత్తం అన్ని మండలాల్లో కాంగ్రెస్ కు కాస్త ఎక్కువ ఓట్లు ఇక్కడే రావచ్చని అభిప్రాయపడుతున్నారు.
మునుగోడు నియోజకవర్గం మొత్తం ఓట్లు – 2,43,594
మొత్తంగా చూస్తే తాజా పరిస్థితి ప్రకారం టీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 36 శాతం, కాంగ్రెస్ 14 శాతం, Others 9 శాతం ఓట్లు రాబట్టుకోవచ్చని తెలుస్తోంది.