Advertisement
మునుగోడు ప్రచారంలో టీఆర్ఎస్ గెలుపు కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది మొదలు నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలోపేతంపై ఆయనకే అంతా అప్పగించారు కేసీఆర్. అభ్యర్థి ఎంపిక విషయంలో, ఇతర వాటిల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేశారు. దానికి తగ్గట్టే ఆయన కూడా నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం తెగ కష్టపడుతున్నారు. అయితే.. ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చివరకు ఎన్నికల ప్రచారానికి దూరం చేశాయి.
Advertisement
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 25న జగదీశ్ రెడ్డి మల్కాపూర్ లో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అంశాలపై మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు. ఈ ఒక్క డైలాగే ఆయన్ను చిక్కుల్లో పడేసింది. ప్రతిపక్షాలకు ఓ అస్త్రంగా మారి ఎన్నికల సంఘం వరకు వెళ్లింది.
Advertisement
మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం తెలుపుతూ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ కోరుతూ జగదీశ్ రెడ్డికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే.. ఆయన చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. 48 గంటలపాటు ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 1 సాయంత్రం 6 గంటలకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. అంటే జగదీష్ రెడ్డి ప్రచరానికి దూరమైనట్టే. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. ఆయన 48 గంటలపాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరు కావడానికి వీలు లేదు. అంతేకాదు మీడియాతో మాట్లాడడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివి కూడా చేయొద్దని ఈసీ ఆదేశించింది.