Advertisement
సీబీఐ… కేంద్ర దర్యాప్తు సంస్థ. దీన్ని మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందనేది ప్రతిపక్షాల వాదన. తమపై కక్షపూరితంగా సీబీఐని ఉసిగొల్పుతోందని తరచూ మండిపడుతుంటాయి. ఈ క్రమంలోనే రాష్ట్రాలు సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తున్నాయి. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలకు ఇది పాకుతోంది. తాజాగా తెలంగాణ కూడా ఈ నిషేధ లిస్ట్ లోకి చేరిపోయింది.
Advertisement
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 సెక్షన్ ప్రకారం ఒక రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు నిర్వహించాలనుకుంటే అక్కడి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రాలకు ఇష్టంలేక తమ సమ్మతిని ఉపసంహరించుకుంటే సీబీఐ హైకోర్టుకు వెళ్లొచ్చు. హైకోర్టు అనుమతించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ ఉండదు. పోలీసింగ్ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోకూడదని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
Advertisement
ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్, మేఘాలయ, రాజస్థాన్, చత్తీస్ గఢ్ తో కలిపి 10 రాష్ట్రాలు సీబీఐకి తమ రాష్ట్రంలో ప్రవేశాన్ని నిషేధించాయి. ఇప్పుడు తెలంగాణ కూడా ఈ లిస్ట్ లోకి చేరింది. గతంలో దర్యాప్తుల కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. జీవో నెంబర్ 51ని తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలోకి సీబీఐ డైరెక్ట్ గా రావడానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆ తర్వాతనే విచారణ జరపాల్సి ఉంటుంది.
ఆగస్టు 30వ తేదీన హోంశాఖ ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. కొన్నాళ్ల క్రితం బిహార్ టూర్ లో కేసీఆర్ సీబీఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ ప్రభుత్వం సీబీఐని నిషేధించడాన్ని సమర్థించారు. దీంతో తెలంగాణలోనూ ఇది త్వరలో అమలవుతుందని వార్తలు వచ్చాయి. అనుకున్నట్టే కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలతో ప్రత్యర్థులను లొంగదీసుకుంటోందని, ప్రభుత్వాలను కూలదోస్తోందని అంటున్నారు కేసీఆర్.