Advertisement
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. తమిళనాడులో మొదలైన ఈ యాత్ర జమ్మూకాశ్మీర్ లో ముగుస్తుంది. ఇప్పటికే 50 రోజులకు పైగా నడిచారు రాహుల్. యాత్ర ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా ఎవరిని కలిసినా రాహుల్ ఒకటే విషయాన్ని చెబుతున్నారు. దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విచ్ఛిన్నం చేశాయని.. ప్రజల మధ్య అంతరాలు ఏర్పడ్డాయని వాటిని రూపుమాపడమే తన యాత్ర ఉద్దేశం అని చెబుతున్నారు.
Advertisement
అయితే.. రాహుల్ గాంధీ యాత్రపై ఆయన బావ రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ను సాయి బాబాతో పోల్చారు. దీనికి ఆయన చాలా పెద్ద లాజిక్ నే వివరించారు. లక్షలాది మంది ప్రజలు నిత్యం షిర్డీ వచ్చి సాయిబాబాను దర్శించుకుంటూ ఉంటారు. వారి కష్టసుఖాలను ఆయనతో చెబుతుంటారు. బాబా కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సందేశం ఇచ్చారు. ఇప్పుడు దేశానికి ఇదే కావాలన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన కూడా అదేనని తెలిపారు.
Advertisement
సర్వధర్మ సమానత్వం అనే ఆలోచన సాయిబాబాకు, రాహుల్ కు ఉందన్నారు రాబర్ట్. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర ప్రారంభించారని తెలిపారు. సాయిబాబా చేసిన పనినే ఇప్పుడు రాహుల్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని కనీసం దానిపై మాట్లాడేందుకు కూడా ఆంక్షలు విధించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ప్రస్తుతం రాహుల్ గాంధీని నమ్ముతున్నారని తెలిపారు. దేశంలో ఎన్నికలు పూర్తవ్వగానే మళ్లీ ఈడీ దాడులు మొదలవుతాయన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజలు ఏనాడూ భయపడలేదని.. ఆయనతో మమేకమయ్యారని చెప్పారు. రాజీవ్ గాంధీ కలలను రాహుల్ గాంధీ నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రాబర్ట్ వాద్రా.