Advertisement
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ ఈసీ దగ్గర పెండింగ్ లో ఉంది. దసరా రోజున ప్రకటన అయితే చేశారు కానీ, అదే రీతిలో కార్యక్రమాలు లేవు. దానికి మునుగోడు ఉప ఎన్నికే కారణం. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే కేసీఆర్ బీఆర్ఎస్ పైనే ఫోకస్ పెడతారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Advertisement
జోడో యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన రాహుల్.. కేసీఆర్ కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై మొదటిసారి స్పందించారు. కేసీఆర్ కావాలంటే అంతర్జాతీయ పార్టీ కూడపెట్టుకోవచ్చన్నారు. అమెరికా, చైనాలోనూ పోటీ చేసుకొవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమి లేదన్నారు. బీఆర్ఎస్ ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. టీఆర్ఎస్ విధానాలకు తాము పూర్తి వ్యతిరేకమని చెప్పారు.
Advertisement
టీఆర్ఎస్ తో పొత్తు వద్దని తమ నేతలు చెబుతున్నారని అన్నారు రాహుల్. రాష్ట్ర నేతల అభిప్రాయం ప్రకారమే ముందుకు వెళతామని తెలిపారు. టీఆర్ఎస్ తో భవిష్యత్ లోనూ ఎలాంటి పొత్తు ఉండదని తేల్చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్న రాహుల్.. అలాంటి వారితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు.
మరోవైపు గుజరాత్, హిమాచల్ ఎన్నికలపై మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడు ఖర్గే ఆ పనిలోనే ఉన్నారని తెలిపారు. బీజేపీ అస్తవ్యస్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్న రాహుల్.. హింసను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కార్పొరేట్ వర్గాల కోసమే ప్రధాని మోడీ పని చేస్తున్నారని ఆరోపించారు.