Advertisement
గుజరాత్ చరిత్రలో మరో తీవ్ర విషాదంగా చరిత్రకెక్కింది కేబుల్ బ్రిడ్జ్ ఘటన. ఆదివారం సాయంత్రం మోర్బీ జిల్లాలో జరిగిన ఈ దుస్సంఘటనలో 141 మంది చనిపోయారు. ఇంకా కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఘటనలో వందల మంది గాయపడ్డారు. చాలామంది చావును దగ్గర నుంచి చూసి బయటపడ్డారు.
Advertisement
వందేళ్ల క్రితం నాటి ఈ వంతెనను ఈమధ్యే రిపేర్ చేశారు. అంతా పూర్తి చేసి సందర్శకులకు అనుమతినిచ్చారు. దీపావళి రోజులు, పైగా సెలవు రోజు కావడంతో జనం భారీగా తరలివచ్చారు. ఉన్నట్టుండి బ్రిడ్జ్ కూలిపోయింది. ఆ సమయంలో 500 మంది దాకా నదిలో పడిపోయారు. అయితే.. ఈ ప్రమాదానికి అనేక కారణాలు తెరపైకి వస్తున్నాయి.
Advertisement
ప్రమాదంపై సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జ్ కాంట్రాక్టర్ సహా 9 మందిని అరెస్ట్ చేశారు. సదరు కంపెనీకి బ్రిడ్జ్ లు రిపేర్ చేయడంలో అంత అనుభవం లేదని విచారణలో తేలింది. ఒరేవా గ్రూప్ దీని మరమ్మతు పనులను పర్యవేక్షించింది. నిజానికి ఈ కంపెనీ గోడ గడియారాలు, బల్బులు, ఎలక్ట్రానిక్ బైకులను తయారు చేసే సంస్థ. అలాంటి సంస్థకు బ్రిడ్జ్ పనులు అప్పగించారు.
కాంట్రాక్ట్ సంస్థకు అనుభవం లేక చేసిన పని కారణంగానే ఇది కూలిపోయిందనేది ఓ వాదన. అయితే.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనంలో కొందరు అటూఇటూ దాన్ని ఊపడం వల్లే ఘటన జరిగిందనేది మరో వాదన. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.