Advertisement
దుబ్బాక, హుజూరాబాద్. మునుగోడు.. ఇలా ఏ ఉప ఎన్నికొచ్చినా వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. కొత్త పథకాలను తెచ్చి మరీ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది. వరుసబెట్టి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ప్రజలు ఫోన్లు చేసి తెగ విసిగిస్తున్నారు. సార్.. రాజీనామా చేయండి.. మనకూ నిధులొస్తాయి.. బాగుపడతాం.. అని వేడుకుంటున్నారు.
Advertisement
ఉపఎన్నిక వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం రాష్ట్రంలోని చాలాచోట్ల ప్రజల్లో వ్యక్తమవుతోంది. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి తమ డిమాండ్ ను వారి ముందుంచారు. తాజాగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ రాజీనామాతోనైనా రోడ్లు బాగుపడ్తయ్ అని వ్యాఖ్యానించాడు. స్పందించిన ఎమ్మెల్యే అభివృద్ధి ఎక్కడ జరగలేదో చెప్పాలని అతడిని అడగ్గా.. అతను నియోజకవర్గంలోని సమస్యలను వివరించాడు.
Advertisement
మొదట మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఫోన్ వచ్చింది. తర్వాత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..ఇలా వరుసబెట్టి నేతలకు ప్రజల నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. రాజీనామాలు చేయాలంటూ తెగ ఫోన్ చేస్తున్నారు.
అయితే.. తరచూ ఫోన్లు వస్తుండడంతో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది తమకు ఫోన్లు చేసిన వారిని అనుచరులతో బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరుగుతోందని.. ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.