Advertisement
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాలని తెగ కష్టపడుతోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు పాదయాత్ర చేస్తున్నారు. ఇది హైదరాబాద్ మహానగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డు దగ్గరలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీనికి కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఖర్గే కూడా హాజరయ్యారు.
Advertisement
మీటింగ్ లో మాట్లాడిన రాహుల్.. బీజేపీ, టీఆర్ఎస్ పై మండిపడ్డారు. హైదరాబాద్ లో రోడ్లు తక్కువ.. గుంతలు ఎక్కువని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో డ్రామాలు ఆడుతారని.. ఆయన ఇక్కడ చెప్పేదొక్కటి ఢిల్లీలో చేసేది మరొకటని ఫైరయ్యారు.
Advertisement
ప్రధాని మోడీతో కేసీఆర్‌కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్. కాలుష్యంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే.. అవినీతిలో తెలంగాణ ముందుందని విమర్శించారు. తెలంగాణలో ఏడు రోజుల్లో అనేక వర్గాలతో మాట్లాడానని.. ఎవరిని కదిలించినా సమస్యలతో కన్నీరు పెడుతున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వినే ఓపిక కేసీఆర్ కి లేదని ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయన్నారు రాహుల్. ధరణి పోర్టల్ ను ప్రతి రోజు రాత్రి కేసీఆర్ చెక్ చేసుకుంటారని.. ఆయన కమిషన్లు లేనిదే కాంట్రాక్టులు చేయరని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు చూపిన ప్రేమ ఉత్సాహం ఎప్పటికీ మరవలేనని.. సంస్కృతి, సంప్రదాయం అనేవి తెలంగాణ డీఎన్ఏ లోనే ఉన్నాయని కొనియాడారు. జోడోయాత్ర శాంతియుతంగా జరుగుతోందన్న రాహుల్.. దేశంలో హింస చెలరేగేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.