Advertisement
రాజస్థాన్ కాంగ్రెస్ లో వివాదాలు కొత్తేం కాదు. అక్కడ సీఎం అశోక్ గెహ్లాట్ కు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. గెహ్లాట్ ఎప్పుడు దొరుకుతారా? అని పైలట్ ఎదురుచూస్తుంటారు. అలా.. ప్రధాని మోడీ.. గెహ్లాట్ ను పొగిడిన వ్యాఖ్యలు ఆయనకు అస్త్రాలుగా మారాయి. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గేను హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సచిన్ పైలట్.
Advertisement
అశోక్ గెహ్లాట్ ని ప్రధాని పొగడడాన్ని తేలికగా పరిగణించరాదన్నారు. గతంలో మోడీ ఇలాగే పార్లమెంటులో గులాం నబీ ఆజాద్ ని పొగిడారని, చివరికి ఏమైందో అందరం చూశామని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం వెరీ ఇంట్రెస్టింగ్ అని వ్యాఖ్యానించారు. గెహ్లాట్ కూడా ఆజాద్ దారిలో నడవవచ్చు అని పేర్కొన్నారు. పైలట్ వ్యాఖ్యలపై గెహ్లాట్ స్పందించారు. ఇవి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలంటూ కొట్టిపారేశారు.
అంతేకాదు.. దీనిపై గెహ్లాట్ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం కోరారు. పార్టీలో నేతలు బహిరంగవ్యాఖ్యలు చేయకుండా జోక్యం చేసుకోవాలని విన్నవించారు. దీనిపై స్పందించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లయింది.
Advertisement
ప్రధాని మోడీ మంగళవారం రాజస్థాన్ లోని బన్స్వారా పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే ప్రోగ్రాంకి సీఎం అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. పాత విషయాలను గుర్తు చేశారు. గెహ్లాట్ గొప్పదనాన్ని వివరించారు. దేశంలో అత్యంత సీనియర్ సీఎంలలో గెహ్లాట్ ఒకరని అన్నారు మోడీ. ఆయన అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేత అని ప్రశంసించారు. ముఖ్యమంత్రులుగా తామిద్దరం కలిసి పని చేశామని తెలిపారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమయంలో గెహ్లాట్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు మోడీ. ప్రధాని ప్రశంసలపై అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్రధాని మోడీ విదేశాలకు ఎప్పుడు వెళ్లినా అక్కడ విశేష గౌరవం లభిస్తోందన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకున్న జాతిపిత గాంధీ పుట్టిన దేశానికి ఆయన ప్రధాని అని తెలిపారు. అలాంటి దేశానికి ప్రధానిగా మోడీ తమ కంట్రీకి వచ్చినందుకు అక్కడి వారంతా గర్వపడుతుంటారని అన్నారు గెహ్లాట్.