Advertisement
మునుగోడు యుద్ధం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. ఈవీఎంలు మొరాయిచడం, చిన్న చిన్న గొడవలు మినహా అంతా ప్రశాంతంగా సాగింది. అయితే.. ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినా.. గెలిచేది తామేనని అంటున్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ ఎన్నో ప్రలోభాలకు గురిచేసిందని.. కానీ, ప్రజలు మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
పోలింగ్ అయిపోయిన వెంటనే మీడియాతో మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈసీ టీఆర్ఎస్ కు కొమ్ము కాసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎన్ని వీడియోలు వస్తున్నా పట్టించుకోలేదని వివరించారు. కమిషనర్ టీఆర్ఎస్ మనిషిలా మారారని.. ఎన్ని ఆధారాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఫైరయ్యారు. ఇక కేసీఆర్ నిజాం అయితే పోలీసులు రజాకార్లు.. గులాంగిరి చేశారని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే అని చెప్పారు.
Advertisement
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రక్రియను నాశనం చేశారని ఆరోపించారు. పుట్టకముందే బీఆర్ఎస్ ఖతమవుతోందని ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఒత్తిళ్లు, డబ్బు, మద్యంతో బెదిరింపులకు పాల్పడ్డా.. మునుగోడు ఓటర్లు తెగువ చూపారని ప్రశంసించారు. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ కూడా తప్పు చేసిందని అన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు చాలా కీలకం. గెలిచిన పార్టీకి ఎన్నో లాభాలుంటాయి. అందుకే పోటాపోటీగా పార్టీలు ప్రచారం సాగించాయి. ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగింది. 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పుడు గెలిచింది ఎవరో తేలిపోతుంది.