Advertisement
రెండు రోజులుగా ఏపీలో ఇప్పటం గ్రామం పేరు మార్మోగుతోంది. మంగళగిరికి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో జనసేన బలంగా ఉంది. అందుకే ప్రభుత్వాన్ని ఎదిరించి మరీ.. గ్రామస్తులు జనసేన సభ కోసం భూములు ఇచ్చారు. మరి.. ఆ విషయంలో జగన్ హర్టయ్యారో ఏమోగానీ.. చాలా రోజుల తర్వాత ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో కూల్చివేతలు జరిగాయి. ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్య అంటూ ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించారు.
Advertisement
అయితే.. ఇప్పటం వెళ్లడానికి పవన్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనాలను ఆపేశారు. దీంతో పవన్ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత కారుపైకి ఎక్కి అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇప్పటం గ్రామం ప్రధాన రహదారికి దూరంగా ఉంటుందని… వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉండవని తెలిపారు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల వెడల్పు రోడ్డు ఉందని.. ఇప్పుడు దాన్ని 120 అడుగుల రోడ్డుగా మార్చేందుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఉవ్విళ్లూరుతున్నారని దుయ్యబట్టారు.
Advertisement
రోడ్డు వెడల్పు పేరుతో వారికి ఓటు వేయని వారి ఇళ్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు పవన్. అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలేస్తున్నారని.. సామాన్యులను వేధిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. మన వాళ్లు కాని వాళ్లని తొక్కి నార తీయండి అనే విధంగా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. తాము ప్రజలందరికీ పాలకులం కాదని.. తమకు ఓటు వేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులమని వారు భావిస్తున్నట్టు ఈ చర్యలు చూస్తే అర్థమవుతోందని మండిపడ్డారు.
పవన్ కామెంట్స్ తో వైసీపీ లీడర్లు వరుసబెట్టి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని, అభివృద్ధి పనుల కోసం ప్రహారీలు మాత్రమే కూల్చారని తెలిపారు మంత్రి జోగి రమేష్. ఇప్పటం వెళ్లి ప్రజలను రెచ్చగొట్టాలనేదే పవన్ పర్యటన ఉద్దేశమని ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కూల్చి పారదొబ్బడానికి ఇది సినిమా సెట్టింగు కాదు, షూటింగ్ కాదు పవన్ కల్యాణ్’ అని ట్వీట్ చేశారు.