Advertisement
మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరో అమెరికా చేస్తానని ప్రకటించారు. నిరుద్యోగులకు అమెరికన్ వీసాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మునుగోడులో గెలిచేది తానేనని 50వేల మెజార్టీతో తన విజయం తథ్యమని ప్రెస్ మీట్లలో హోరెత్తించారు. అంతేకాదు విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరగా.. తిరస్కరించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, చివరకు ఆయనకు దక్కిన ఓట్లు 805.
Advertisement
నిజానికి ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రజాయుద్ధనౌక గద్దర్ బరిలోకి దిగాల్సి ఉంది. కేఏ పాల్ ప్రకటన కూడా చేశారు. రేపు నామినేషన్ అనగా.. గద్దర్ సైలెంట్ అయిపోయారు. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడడం వల్లే గద్దర్ నామినేషన్ వేయలేకపోయారని చెప్పిన పాల్.. స్వయంగా రంగంలోకి దిగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ప్రచారంలో ఆది నుంచి తనదైన స్టయిల్ లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
Advertisement
ఎన్నికల ప్రచారంలో ఏ రాజకీయ నాయకుడు చేయని పనులెన్నో చేశారు కేఏ పాల్. పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశారు. చెప్పులు కుట్టారు. దోశలు వేశారు. రైతు వేషం కట్టారు. గొర్రెల కాపరిలా మారారు. ఇలా ఒకటేంటి రకరకాల విన్యాసాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎప్పుడూ లేనిది కేఏ పాల్ మీడియా ముందుకొస్తే ఛానళ్లు లైవ్ లు ఇచ్చాయి. యూట్యూబ్ లో ప్రత్యేకంగా లైవ్ లు పెడితే జనం కూడా తెగ చూశారు. కానీ, ఓట్లు మాత్రం రాలలేదు.
పాల్ మొదట్నుంచి అధికార పార్టీనే టార్గెట్ చేశారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. విపక్ష నేతలను కూడా ఓ ఆటాడుకున్నారు. అలాగే తాను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చెబుతూ వచ్చారు. మునుగోడులో గెలిచేది తానేనని.. ఆరు నెలల్లో అమెరికా చేసేస్తా.. తెలంగాణకు కాబోయే సీఎం అంటూ తెగ హడావుడి చేశారు. కానీ, ప్రజలు మాత్రం పాల్ ని నమ్మలేదు. ఆయన చేసిన విన్యాసాలను చూసి ఎంజాయ్ చేశారే గానీ ఓట్లు వేయలేదు.