Advertisement
ఈమధ్యే నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. సోమవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రెండవ అంతస్థులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అందించిన నియామక పత్రం స్వీకరించి పదవీ బాధ్యతలు చేపట్టారు.
Advertisement
ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. సలహాదారుగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. అలాగే మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
Advertisement
రాష్ట్రంలో నవరత్నాలు పటిష్టంగా అమలవుతున్నాయని చెప్పిన అలీ.. ఇటీవల తాను విశాఖలో పర్యటించిన విషయాలను వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కళ్లకు కట్టినట్లుగా కనిపించాయని, ఏ వీధిలో చూసినా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు ఉన్నాయని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజాభిమానం పొందిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.
ప్రజల పట్ల జగన్ చూపించే అభిమానం వెలకట్టలేనిదన్నారు అలీ. ప్రజలకు మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి అనుకున్నది సాధిస్తారని చెప్పారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ కీర్తి, ప్రతిష్టలు సాధించారని, గొప్ప ప్రజా నాయకుడిగా, మహా నాయకుడిగా పేరొందారన్నారు. ఇచ్చిన మాటను, తూ.చ తప్పకుండా ఆచరించి చూపిస్తున్నారని కొనియాడారు అలీ.