Advertisement
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి నిందితుల్లో ఒకడైన రామచంద్ర భారతికి షాకింగ్ న్యూస్ కాగా.. మరొకటి బీజేపీని ఇబ్బంది పెట్టేది. మొదటి దాని గురించి మాట్లాడుకుంటే.. రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నాడని బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Advertisement
రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి మొన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో వివరించారు. ఆరోజు ఫోటోలతో సహా అన్నీ వివరించారు. వీళ్లు బీజేపీ దూతలని.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చారని ఆయన మండిపడ్డారు.
Advertisement
ఇక రెండో విషయానికొస్తే.. తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. దర్యాప్తుపై గతంలో విధించిన తాత్కాలిక స్టేను తీసివేసింది. దీంతో పోలీసుల దర్యాప్తునకు మార్గం సుగమం అయింది. అలాగే బీజేపీ వేసిన రిట్ పిటిషన్ ని తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టింది హైకోర్టు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఆదేశించింది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో తమకు సంబంధం లేదని.. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ విచారణ జరిపి పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది. వాయిదాల తర్వాత తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. దర్యాప్తు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేసింది. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.