Advertisement
కొండమడుగు.. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని గ్రామం. ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలు చుట్టుపక్కల ఉండే ఫ్యాక్టరీలతో సతమతం అవుతున్నారు. వాటితో కాలుష్యం పెరుగుతోందని.. దీనికి అడ్డుకట్ట పడాలని ఎన్నాళ్ల నుంచో దీక్షలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా రిలే నిరాహాద దీక్షలకు దిగారు. ఆరో రోజు నిరసన దీక్షలో స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. శిబిరానికి వెళ్లి గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు.
Advertisement
గ్రామ పరిసరాలలో చందోక్ ల్యాబరేటరీస్, ఆస్ట్ర ఇండస్ట్రీస్, అజంతా కెమికల్స్ పరిశ్రమలను తొలగించాలని కొండమడుగు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను కోమటిరెడ్డికి వివరించారు. దీంతో ఆయన చందోక్ పరిశ్రమలోని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ కంపెనీలోని ఓల్డ్ మిషనరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Advertisement
కొండమడుగు గ్రామాన్ని పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలన్నారు వెంకట్ రెడ్డి. రసాయన పరిశ్రమలను తొలగించే వరకు గ్రామస్తులకు అండగా ఉండి పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో హైదరాబాద్, వరంగల్ మార్గంలోని బీబీనగర్ ఎయిమ్స్, కొండమడుగు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని కోమటిరెడ్డి తెలిపారు.
కొండమడుగు పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. వాయు, నీటి కాలుష్యం పెరిగి పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల ప్రతినిధులతో ఎంపీ ఫోన్ లో మాట్లాడారు. చందోక్ ల్యాబరేటరీస్ పాత యంత్రాలు తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.