Advertisement
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీలు ఓట్లు రాబట్టేందుకు తెగ శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సుజన్ పూర్, చాంబిలలో పర్యటించారు. అయితే.. కాంగ్రాలోని ర్యాలీ గ్రౌండ్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో మోడీ కాన్వాయ్ కాసేపు ఆగింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
ప్రధాని కాన్వాయ్ వస్తున్న సమయంలోనే అంబులెన్స్ రావడాన్ని గమనించారు. దీంతో అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం ప్రధాని తన కాన్వాయ్ ను అపారు. అది వెళ్లిన తర్వాతే కాన్వాయ్ ముందుకు కదిలింది. మోడీ హెలిప్యాడ్ వద్దకు వెళ్తుండగా ఇది జరిగింది. ఈ దృశ్యాన్ని బీజేపీ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. విలువైన జీవితాలను కాపాడేందుకు మోడీ ఎప్పుడూ ప్రాధాన్యమిస్తారని పేర్కొంది.
Advertisement
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రా అతి పెద్ద జిల్లా. ఈ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సాధారణంగా ఇక్కడ ఏ పార్టీ ప్రాబల్యం ఉంటే అది ఎన్నికల్లో గెలుస్తుందని అంటారు. ఇండియాలో వీవీఐపీలు తమ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అంబులెన్స్ లు వచ్చిన సందర్భాల్లో కూడా ఆగకుండా వెళ్లడం తరచూ జరుగుతుందని, కానీ మోడీ తీరే వేరని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. ఆపార్టీ దేశ భద్రతతో పాటు అభివృద్ధికి విరుద్ధం అని ఆరోపించారు. ఎన్నికలకు కొన్ని రోజులే ఉండటంతో బీజేపీ అగ్రనాయకత్వం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోసారి అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా వరసగా హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోలేదు.