Advertisement
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరి విడుదలపై తమిళనాడు ప్రభుత్వం గతంలోనే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో గుర్తు చేసింది.
Advertisement
నిందితుల విడుదలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇది అంగీకారయోగ్యం కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఈ తీర్పు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీం నిర్ణయాన్ని తమ పార్టీ విమర్శిస్తోందని తెలిపారు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు భారతదేశ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించలేదని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
Advertisement
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాజీవ్ గాంధీ. ఆ సమయంలో ఆయనపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను అనే మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులో పెరరివాలన్, నళిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్ ను దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే.. ఆ మరుసటి ఏడాది పెరరివాలన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. జీవిత ఖైదుగా తగ్గిస్తూ గతంలో కోర్టు తీర్పునిచ్చింది.
ఈ కేసులో పెరరివాలన్ అనే నిందితుడు గత మే నెలలో రిలీజయ్యాడు. అతని మాదిరే తమను కూడా విడుదల చేయాలని నళిని, రవిచంద్రన్ లోగడ మద్రాస్ హైకోర్టును కోరారు. అయితే, కోర్టు వీరి అభ్యర్థనను నిరాకరించింది. రాజ్యాంగంలోని 142 అధికరణం కింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలు తమకు లేవని, అందువల్ల మీ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నామని పేర్కొంది. దోషుల రిలీజ్ పై తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేసింది. వీరికి క్షమాభిక్షకు సంబంధించి.. అది గవర్నర్ విచక్షణాధికారాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తూనే ఏడుగురు దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్లను ప్రభుత్వం పరిశీలించింది. పెరరివాలన్ విడుదల అనంతరం రవిచంద్రన్ తమను కూడా రిలీజ్ చేయాలని కోరుతూ గతంలో సీఎం స్టాలిన్ కి లేఖ రాశాడు. ఇదే క్రమంలో దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.