Advertisement
కొన్నాళ్ల నుంచి వివాదాస్పదంగా మారిన అంశం జ్ఞానవాపి మసీదు. అక్కడ శివలింగం ఉందని నందికి ఎదురుగా ఉన్న దాన్ని దాచేశారని కోర్టు మెట్లెక్కారు. శుక్రవారం సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇప్పటివరకు ఉన్న పరిస్థితే కొనసాగుతుందని తెలిపింది.
Advertisement
Advertisement
గతంలో మసీదు వీడియో సర్వేలో భాగంగా వాజూఖానాలోని ఓ కొలనులో ‘శివలింగం’ వంటి ఆకారాన్ని కనుక్కున్నారు. అప్పటి నుంచీ ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి ముస్లింలకు అనుమతి ఇచ్చింది. శివలింగం దొరికిన చోటును మాత్రం పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా అదే తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం.
సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి దాఖలైన అన్ని దావాలను ఒక్కటి చేసి విచారించాలని కోరుతూ వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ వేసేందుకు హిందూ సంఘాలకు కోర్టు అనుమతించింది. అలాగే సర్వే కమిషనర్ ను నియమించాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన అప్పీల్ పై మూడు వారాల్లోగా సమాధానాలను తెలియజేయాలని సూచించింది.