Advertisement
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ, పోలీసులు పకడ్బంధీగా వ్యవహరించి ఎక్కడిక్కడే ముందస్తు అరెస్టులు చేశారు. టీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉన్నా.. వామపక్ష నాయకులు పలుచోట్ల నిరసనలకు దిగారు. అయితే.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మోడీ టూర్ ప్రశాంతంగా జరిగింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు వచ్చారు ప్రధాని. అలాగే.. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు.
Advertisement
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. టీఆర్ఎస్ అస్త్రంగా మారిన సింగరేణి ప్రైవేట్ పరం ఇష్యూపై స్పందించారు. ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసలు ఆ అధికారం కేంద్రానికి లేదని చెప్పారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా.. కేంద్రానికి 49 శాతం ఉందన్నారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుందని కొందరు హైదరాబాద్ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
Advertisement
సింగరేణిలో గతంలో అనేక స్కాంలు జరిగాయని ఆరోపించారు మోడీ. బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే వదంతులను నమ్మవద్దని సూచించారు ప్రధాని. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. కరోనా ప్రపంచ దేశాలను ఎంతో ఇబ్బంది పెట్టిందని.. ఆ కష్టకాలంలోనూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించిందన్నారు. ఎనిమిదేండ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని దీనికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీయే నిదర్శమని చెప్పారు.
అంతకుముందు బేగంపేటలో బీజేపీ బహిరంగ సభ జరిగింది. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోడీ. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం కొనసాగుతోందని.. పసుపు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వం మెత్తం మునుగోడులో మకాం వేసిందంటూ సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులు అని.. అక్కడ బీజేపీ పోరాటాన్ని ప్రశంసించారు ప్రధాని మోడీ.