Advertisement
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితులు ఎట్టకేలకు విడుదలయ్యారు. మూడు దశాబ్దాల వారి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఆరుగురు బయటకు వచ్చాక భావోద్వేగానికి లోనయ్యారు.
Advertisement
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాజీవ్ గాంధీ. ఆ సమయంలో ఆయనపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను అనే మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ తో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులో పెరరివాలన్, నళిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీథరన్ ను దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే.. ఆ మరుసటి ఏడాది సుప్రీంకోర్టు నిలిపివేసింది. జీవిత ఖైదుగా తగ్గిస్తూ కోర్టు తీర్పు వచ్చింది.
Advertisement
అప్పటినుంచి జైలులోనే కాలం వెళ్లదీస్తున్నారు వీరంతా. అయితే.. ఈ కేసులో పెరరివాలన్ గత మే నెలలో రిలీజయ్యాడు. ఇదే క్రమంలో రాజ్యాంగంలోనే లేని విధంగా మూడు దశాబ్దాలకు పైగా శిక్ష అనుభవించిన తమకు జైలు నుంచి విముక్తి కల్పించాలంటూ మిగిలినవారు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం వీరి వినతుల్ని ఆలకించి విడుదల చేయాలని శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో వారంతా బయటకు వచ్చారు.
నలుగురుని తిరుచిరాపల్లిలో ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తరలించారు. వీరిని అక్కడ నుంచి శ్రీలంకకు పంపడంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. నళిని చెన్నైలో ఉంటారా లేదా లండన్ లో ఆమె కుమార్తె వద్దకు వెళ్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పెరోల్ పై ఉన్న నళిని తాను శిక్ష అనుభవించిన వెల్లూరులోని ప్రత్యేక మహిళా కారాగారానికి వెళ్లి విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. అక్కడి నుంచి వెల్లూరు కేంద్ర కారాగారానికి వెళ్లి విడుదలైన తన భర్త మురుగన్ ను చూసి భావోద్వేగానికి లోనయ్యింది.
ఆరుగురి విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, వివిధ తమిళ సంస్థలు సుప్రీం తీర్పును స్వాగతించాయి.