Advertisement
సినీ గ్లామర్ ను వాడుకోవడంలో బీజేపీని కొట్టిన పార్టీ లేదు. మోడీ ప్రధాని అయ్యాక ఇది బాగా పెరిగింది. సినీ ప్రముఖులకు అవార్డులు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా టికెట్లు.. స్టార్స్ తో పార్టీలు, సమావేశాలు ఇలా అన్ని ఇండస్ట్రీలను ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ ఉంటుంది. అయితే.. ఈ ట్రెండ్ ఒకప్పుడు టీడీపీలో ఉండేది. అసలు.. ఆ పార్టీ పుట్టిందే సినిమా హీరో చేతుల్లో కాబట్టి సాధారణంగా సినీ గ్లామర్ ఎక్కువగా కనిపించేది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పదవులు అనుభవించిన సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది.
Advertisement
తెలుగుదేశం పార్టీలో మెల్లమెల్లగా సినీ గ్లామర్ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అయితే.. నందమూరి ఫ్యామిలీ తప్ప అంత పెద్ద స్టార్స్ ఎవరూ లేరనే చర్చ సాగుతోంది. ఇదంతా పక్కా ప్లాన్ తోనే జరుగుతోందనే వాదన ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఆయన తన తండ్రి హరికృష్ణ మాట కాదనలేక ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది లేదు. 2014లో సైలెంట్ గా ఉన్నారు. 2019లోనూ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. కానీ, టీడీపీకి నష్టం చేకూర్చేలా పెద్ద పెద్ద వివాదాలు నడిచినప్పుడు ప్రెస్ నోట్ లాంటిది వదలి సరిపెట్టారు. చంద్రబాబుతో ఎన్టీఆర్ కు ఉన్న ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావించారు. ఆమధ్య హైదరాబాద్ వచ్చిన అమిత్ షా ఎన్టీఆర్ ని కలిశారు. దీనిపై రకరకాల వార్తలు, వదంతులు చెలరేగాయి.
Advertisement
ఇక ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకెళ్దామని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే.. ప్రధాని మోడీ మాత్రం బాబు ఆశలపై నీళ్లు జల్లినట్లుగా అనిపిస్తోందని అంటున్నారు. విశ్లేషకులు. విశాఖ టూర్ కు వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ భేటీలో ఏం జరిగిందనేది సస్పెన్స్ గా ఉంచారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కూడా పెద్ద విషయాలేవీ ప్రస్తావించలేదు. బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటించారు. పవన్ తీరు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఇంతకుముందు టీడీపీలో యాక్టివ్ ఉన్న సినీ ప్రముఖులు వయసురీత్యా చాలామంది సైలెంట్ అయిపోయారు. మరికొంతమంది వైసీపీ గూటికి చేరారు. ఈ పరిణామాలన్నీ చూస్తున్న విశ్లేషకులు టీడీపీలో సినీ గ్లామర్ తగ్గిపోతోందని చెబుతున్నారు. మరి.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాల్సిందేనని సూచిస్తున్నారు.