Advertisement
జీ-20 సదస్సు కోసం ఇండోనేషియా వెళ్లారు ప్రధాని మోడీ. అక్కడ ఆహారం, ఇంధన భద్రత అంశంపై ఏర్పాటైన వర్కింగ్ సెషన్ లో కీలకోపన్యాసం చేశారు. ఆహార భధ్రత, ఎరువులు, ఇంధన అవసరాల గురించి ప్రస్తావించారు. అలాగే ఈ టూర్ లో పలువురు ప్రముఖ నేతల్ని కలిశారు మోడీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ను కలుసుకున్నారు. మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలిపారు.
Advertisement
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సరదాగా నవ్వుతూ కనిపించారు మోడీ. దీనికి సంబంధించిన వీడియోను పీఎంఓ ట్వీట్ చేసింది. ప్రధాని ఏదో చెబుతుండగా బైడెన్ వింటూ సరదాగా నవ్వుతున్నట్టు అందులో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక యూకే నూతన ప్రధాని రిషి సునాక్ తోనూ మోడీ భేటీ అయ్యారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సునాక్ మొదటిసారిగా మోడీని కలిశారు.
Advertisement
గత అక్టోబర్ లో ప్రధాని మోడీ, సునాక్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఇలా ముఖాముఖిగా కలుసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ఇక ఇండొనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ రాత్రి ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు మోడీ. ఇద్దరు ఎదురు పడగానే చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఉదయం అంతా తీరిక లేకుండా సెషన్స్ ల్లో పాల్గొన్న ఇద్దరు నేతలు డిన్నర్ కు క్యాజువల్ దుస్తులతో హాజరయ్యారు.
2019 అక్టోబర్ లో జిన్ పింగ్, మోడీ కలుసుకున్నారు. ఆ తర్వాత ముఖాముఖిగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. జిన్ పింగ్ అప్పుడు భారత పర్యటనకు వచ్చారు. చెన్నైలో బస చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరూ కలిశారు. భారత్, చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న ఈ సమయంలో వీరిద్దరూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.