Advertisement
నిత్యం ఏదో ఒక వివాదంలో గరికపాటి నరసింహారావు పేరు మార్మోగుతుంటుంది. ప్రవచనాలు చెప్తూ.. వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూ తనదైన స్టయిల్ మాటలు చమత్కరిస్తుంటారు ఈయన. మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు గరికపాటి.
Advertisement
మహిళలను అవమానపరిచేలా గరికపాటి ప్రసంగాలు ఉంటున్నాయంటూ తెలుగు రాష్ట్రాల్లో మహిళా సంఘాలు గళమెత్తాయి. ఆయన దిష్టిబొమ్మ దహనాల వరకు వెళ్లింది ఈ వివాదం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు గరికపాటి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు దహనం చేశారు మహిళలు. ఇందులో పాల్గొన్న ప్రగతిశీల మహిళా సమాఖ్య రాష్ట్ర నేత సంధ్య మాట్లాడుతూ.. గరికపాటి ప్రవచనాలు మహిళల పట్ల ఉన్న చులకన భావాన్ని వ్యక్తం చేసేలా ఉన్నాయంటూ ఫైరయ్యారు.
Advertisement
విశాఖ నగరంలో కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో గరికపాటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆయనపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. అహంకారంతో మాట్లాడుతున్న గరికపాటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు. మనువాదాన్ని స్థిరీకరిస్తూ మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న గరికపాటిపై ప్రభుత్వం, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ప్రవచనాల్లో ఏ విషయంపైనైనా నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు గరికపాటి. స్త్రీలు ఉండే విధానం వారి తీరు గురించి ముక్కుసూటిగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. మహిళలతో పాటు భర్తలు భార్యల విషయంలో ఎలా ఉండాలి ఇత్యాది విషయాలపై కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంటారు. అయితే.. వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మహిళలు ఆందోళనల బాట పట్టారు.