Advertisement
ఓవైపు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తోంది బీజేపీ. తమను రెచ్చగొట్టొద్దని వార్నింగ్ ఇస్తోంది. ఇంకోవైపు టీఆర్ఎస్ నేతలు తగ్గేదే లేదంటున్నారు. తాముకూడా ఉప్పు, కారం తింటున్నామని.. దేనికైనా రెడీ అంటూ సవాల్ చేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అయింది. రెండు పార్టీలు కావాలని డ్రామాలు చేస్తున్నాయని విమర్శలు గుప్పిస్తోంది. మూడు ప్రధాన పార్టీల నేతల డైలాగ్స్ తో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.
Advertisement
ఓసారి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం
తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
టీఆర్ఎస్ హింసను ప్రోత్సహిస్తోంది. మేము అహింసతో టీఆర్ఎస్ ను ఎదురుకుంటాం. తెలంగాణలో ఈ రావణ రాజ్యాన్ని అంతం చేస్తాం. హింస, అహంకారంతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఘటనపై అమిత్, జేపీ నడ్డాతో మాట్లాడతా. ఇంట్లో ఉన్న మహిళలపై కూడా దాడి చేయడం బాధాకరం. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోంది.
ప్రశాంత్ రెడ్డి, మంత్రి
కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు గవర్నర్ ఎక్కడికి వెళ్లారు. ఒక ఆడబిడ్డ ఇంటిపై దాడి చేసినప్పుడు గవర్నర్ మహిళగా ఎందుకు స్పందించలేదు. ఇళ్లపైకి దాడులు చేసే ఆట మొదలు పెట్టింది ఎవరు? మా కార్యకర్తలు గాజులు వేసుకోని ఉన్నారా? ఉప్పు కారం తింటున్నాం. మాకు కోపాలు రావా? ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులకు బండి సంజయ్ చుట్టం. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ కుట్ర.
విజయశాంతి, బీజేపీ నేత
కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్దులు నేర్పి ఉంటే బాగుండేది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వారు ఏం భాష మాట్లాడితే బీజేపీ కూడా అదే బాష మాట్లాడుతుంది. ఇలాంటి దాడుల్ని సహించబోం. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి దాడులు చేయడమేంటి?
Advertisement
కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ
అరవింద్ నోరు అదుపులో పెట్టుకోకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి మాట్లాడితే నాలుక కోస్తాం. మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పినా బీజేపీకి బుద్ధి రాలేదు. మత కల్లోలాలు సృష్టించి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు. అరవింద్ ను చెప్పుతో కొట్టాలంటే కవిత చెప్పు కూడా సిగ్గు పడుతుంది.
ఈటల రాజేందర్, ఎమ్మెల్యే
పథకం ప్రకారమే ఎంపీ ఇంటిపై దాడి చేశారు. ఇది ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం. ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తున్నారు. పోలీసుల పహారాలో రాజ్యం నడుపుతున్నారు. నైరాశ్యంతో సహనం కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాళ్ళ కింద భూమి కదిలిపోయి గెలవలేమని దాడులు చేస్తున్నారు. మాజీ నక్సల్స్ తో విపక్ష నేతలపై దాడులకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది.
దానం నాగేందర్, ఎమ్మెల్యే
బీజేపీ నాయకులు అభివృద్ది నిరోధకులు. అరవింద్ మాట్లాడిన విధానం గురించి బీజేపీ అధినాయకత్వం నివేదిక తెప్పించుకోవాలి. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. టీఆర్ఎస్ కార్యకర్తలను జైల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు. అరవింద్ హద్దు మీరి మాట్లాడుతున్నారు. ఆయనలా మేము మాట్లాడలేం.
జగ్గారెడ్డి ఎమ్మెల్యే
బీజేపీ, టీఆర్ఎస్ హోంశాఖలను పెట్టుకుని పొలిటికల్ డ్రామా కంపెనీ నడిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నాయి. రెండు పార్టీలు పోటీ పడి ప్రజలకు మేలు చేస్తున్నాయా అంటే అది లేదు. విభజన జరిగితే ఎదో అయిపోతుంది అని కలలు కన్నారు విద్యార్థులు. విచిత్ర పాలన చేస్తున్నాయి టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు. తిట్టుకునుడు.. కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి..? సొంత పంచాయతీలు ఎక్కువ అయ్యాయి.