Advertisement
రేవంత్ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పంచాయితీలు. ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఎప్పటినుంచో ఉన్న సీనియర్లకు కోపం తెప్పించింది. పైగా తమను లెక్క చేయడం లేదని బహిరంగంగానే కొందరు నేతలు అసహనం వ్యక్తం చేశారు. వివాదాలు కొనసాగుతుండగా.. జరిగిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ ఘోర ఓటమిని చవి చూస్తుండడంతో రేవంత్ టార్గెట్ గా నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆయనపై పీకలదాకా కోపం ఉన్న నేతల్లో మర్రి శశిధర్ రెడ్డి ఒకరు.
Advertisement
కొన్నాళ్లుగా మర్రి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఉంది. బీజేపీ గూటికి వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ తూచ్ అన్నారాయన. ఢిల్లీ వెళ్తే పార్టీ మారుతున్నట్టా అని ఎదురు ప్రశ్నించారు. సొంత పని మీదే వెళ్లానని చెప్పారు. కానీ, సడెన్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది.
Advertisement
తెలంగాణకు చెందిన పలు అంశాలపై ఇద్దరు చర్చించారు. అయితే.. శనివారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శశిధర్. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి క్యాన్సర్ సోకిందని.. నయం చేయలేని స్థితికి చేరుకుందన్నారు. రేవంత్ రెడ్డి తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు మర్రి. ఒక హోంగార్డు కాంగ్రెస్ నుంచి పోతే పోయేదేమీలేదని.. రేవంత్ వ్యవహారశైలి సరిగ్గా లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ అందుబాటులో ఉండడని.. చెంచాగాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని విమర్శించారు. తనలాగే చాలా మంది పార్టీని వీడే అవకాశం ఉందని.. వచ్చే ఎన్నికల్లో 15 మందిని గెలిపించుకొని సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని ఆరోపించారు. మర్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. కొన్ని గంటల్లోనే వేటు వేసింది. కేంద్రమంత్రి అమిత్ షాను కలవడం.. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకింది.. పార్టీ పనైపోయిందంటూ ఆయన వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసింది. 6 సంవత్సరాల పాటు మర్రిని పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక చర్యలతో క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.