Advertisement
జనసేనకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మంచి పట్టుంది. ఈసారి ఆయా నియోజకవర్గాల్లో సీట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ కూడా వాటిపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పర్యటన సందర్భంగా జనసేనను టార్గెట్ చేశారు సీఎం జగన్. పవన్, చంద్రబాబు ఈమధ్య తమ నోటికి ఎక్కువగా పనిచెబుతున్నారని అన్నారు. గతంలో కలిసి చేసిన పాలనను ఇదేం కర్మరా బాబూ అనుకోబట్టే.. 2019లో దత్త పుత్రుడ్ని, సొంతపుత్రుడ్ని అన్నిచోట్లా ప్రజలు ఓడగొట్టి బైబై చెప్పారని విమర్శించారు.
Advertisement
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్ విమర్శలు చేశారు. అయితే.. ఆయన వ్యాఖ్యలపై జనసేన నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. ఇప్పటిదాకా జనసేన చేసిన పోరాటాలు, ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ ఆపార్టీ నేత నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. జనసేన రౌడీసేనలా ఎందుకు కనిపిస్తుందో చెప్పాలని నిలదీశారు.
Advertisement
జనసేన ఎందుకు రౌడీ సేన? అంటూ వరుస ట్వీట్లు చేశారు నాదెండ్ల. ‘‘ జగన్ గారూ మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?’’ అంటూ మండిపడ్డారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్నారని అన్నారు నాదెండ్ల. ఆయనతోపాటు వీర మహిళలను, జన సైనికులను, జనసేన పార్టీని కించపరుస్తూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను బయటపెడుతున్నాయని సెటైర్లు వేశారు.