Advertisement
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఎందులోనూ ప్రభావం చూపలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా బీజేపీ, టీఆర్ఎస్ పై నువ్వా నేనా అన్నట్టు యుద్ధం నడుస్తుంటే.. అదంతా డ్రామా అని మాటలకే పరిమితం అవుతున్నారు. దాన్ని నిరూపించి క్షేత్రస్థాయిలో పార్టీకి బూస్టప్ ఇచ్చేలా కార్యాచరణ ఉండడం లేదనే ఆరోపణలు సొంతపార్టీ నుంచే వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి టైమ్ లో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు.
Advertisement
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. రేవంత్ వ్యవహారాలు.. ఇలా అనేక అంశాలను ఆయన టచ్ చేశారు. అన్నింటిలోనూ హైలైట్ అయింది హోంగార్డ్ వ్యాఖ్యలే. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ‘‘34 ఏళ్లుగా పనిచేసిన హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్ కూడా కాలేడు. సివిల్స్ పరీక్ష రాసి జిల్లా ఎస్పీ అయినోళ్లను పట్టుకుని.. నేను ఇన్నేళ్లు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నా.. నువ్వెట్లా ఎస్పీ అవుతావు అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అర్హతలను బట్టే పదవులు, హోదాలు వస్తాయి’’ అని కామెంట్ చేశారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించే అన్నారనే టాక్ ఉంది.
Advertisement
మునుగోడు ఎన్నిక సందర్భంగా ప్రచారం విషయంపై వెంకట్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా..అక్కడ తనలాంటి హోంగార్డు ప్రచారం అవసరం లేదని.. ఎస్పీ స్థాయి వాళ్లే వెళ్తారని అన్నారు. రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా వెంకట్ రెడ్డి ఇలా రియాక్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే.. రేవంత్ ఎప్పుడైతే హోంగార్డు వ్యాఖ్యలు చేశారో.. అప్పటి నుంచి సీనియర్లకు మరింత దూరం అయ్యారనే వాదన ఉంది. మొదట్నుంచి ఆయన తీరును తప్పుబడుతున్న వారంతా.. అధిష్టానం ఆదేశాలతో సర్దుకుపోతూ వస్తున్నారు. అయితే.. రోజురోజుకీ ఆగడాలు శృతి మించడంతో చేసేదేం లేక సీనియర్లు పార్టీని వీడుతున్నారనే చర్చ జరుగుతోంది.
తాజాగా రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై మాట్లాడే అర్హతను కాంగ్రెస్ కోల్పోయిందని.. కోమటిరెడ్డిని హోంగార్డు అని సంబోధించడం కరెక్ట్ కాదన్నారు. అప్పటినుంచే పార్టీలో ఉన్న వారంతా హోంగార్డ్స్.. రేవంత్ మాత్రమే ఐపీఎస్ అధికారి అన్న మెసేజ్ వెళ్లిందని అన్నారు. పైగా గీత దాటితే సీనియర్ నాయకులపైనా చర్యలు తీసుకుంటామని అనడం.. బాధ కల్గించిందని చెప్పారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అనే పేరు జనాల్లో ఉందన్న ఆయన.. మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లతో తాను సంతృప్తి చెందానని ఆయన అనడంపై మండిపడ్డారు. మునుగోడు నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. రేవంత్ రెడ్డి.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మాత్రమే పనికొస్తారని ఆరోపించారు. బంగారు బాతు గుడ్డు పెట్టే ఆయనను ఠాగూర్ కాపాడుకుంటున్నారని చెప్పారు మర్రి శశిధర్ రెడ్డి. ఈ వ్యాఖ్యల తర్వాత హోంగార్డు వ్యాఖ్యలు పార్టీలో ఎంతటి కల్లోలానికి కారణమయ్యాయో అర్థం అవుతోంది.