Advertisement
వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ కావడంతో మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావించారు కేసీఆర్. అందుకే గతంలో నానా తిట్లు తిట్టిన లెఫ్ట్ పార్టీలనే నమ్ముకుని ముందుకు వెళ్లారు. చివరకు అనుకున్న మెజార్టీ రాకపోయినా గెలవడం మాత్రం జరిగింది. ఈ గెలుపు తమ వల్లే వచ్చిందని లెఫ్ట్ పార్టీలు ప్రకటన చేశాయి. ఇది వాస్తవమే అయినా.. గులాబీ నేతలు పైపై నవ్వులతో సరే అనేశారు. అయితే.. రానున్న ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్న సర్వత్రా ఉంది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
Advertisement
ఈమధ్యే టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు కేసీఆర్. దర్యాప్తు సంస్థల దాడుల గురించి హెచ్చరికలు జారీ చేస్తూనే కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగులకే సీట్లు ఇస్తానని అన్నారు. దీని వెనుక చాలా వ్యూహాలే ఉన్నాయి. పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలకు బ్రేక్ వేయడానికే కేసీఆర్ అలా అని ఉంటారేమో అని రాజకీయ పండితులు అంచనా వేశారు. కానీ, ఇది లెఫ్ట్ పార్టీలకు వేరేలా అర్థం అయినట్లు అనిపిస్తోందని అంటున్నారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తమకి సీట్లు ఇవ్వాల్సిందేనని అన్నారు.
Advertisement
సీట్ల విషయంలో ఏదీ తేల్చకపోతే తెగదెంపులకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు మద్దతు నుంచి తప్పుకుని పోటీ చేస్తామని అన్నారు. తాము 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో బూత్ స్థాయి కమిటీలు వేస్తున్నామని.. టీఆర్ఎస్ తో పొత్తు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. పైగా టీఆర్ఎస్ ప్రభుత్వమే తమ వద్దకు రావాలని వ్యాఖ్యానించారు. ఇది కాస్త అతిగా అనిపిస్తోందని గులాబీ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. మునుగోడులో గట్టెక్కాలని పొత్తు పెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్ నేతలు తలనొప్పిగా తయారవుతారేమో అని మాట్లాడుకుంటున్నారు.
నిజానికి కేసీఆర్ ను నమ్మడానికి లేదు. ప్రస్తుతానికి సిట్టింగులకు సీట్లు ఇస్తానని హామీ ఇచ్చినా.. ఎన్నికల నాటికి ఆయన వ్యూహం మార్చినా మార్చొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు. ముచ్చటగా మూడోసారి గెలవాలని ఆయన చూస్తున్నారని.. అలాగే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారని.. ఇలాంటి సమయంలో లెఫ్ట్ పార్టీలకు కయ్యం పెట్టుకోరనే అంచనా వేస్తున్నారు. వారి డిమాండ్లపై చర్చలు జరిపి ఏదో ఒకటి తెగ్గొట్టేస్తారని అంటున్నారు విశ్లేషకులు.