Advertisement
ఏపీలో వామపక్షాల ప్రభావం తగ్గిపోయింది. ఇది కాదనలేని వాస్తవం. అయితే.. అక్కడక్కడా కాస్తో కూస్తో క్యాడర్ ఉంది. నాయకులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తరచూ నిలదీస్తున్నారు. కానీ, జగన్ సర్కార్ లైట్ తీసుకుంటోంది. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే.. ప్రతిపక్షాలు కలవాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు సీపీఐ నేత నారాయణ.
Advertisement
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకో సైలెంట్ అయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. టీడీపీ, జనసేన, వామపక్షాలు ఏపీలో కలిసి వెళ్లాలని కోరారు. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. అందుకే జగన్ పల్లెత్తు మాట అనడం లేదని చెప్పారు. నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
నిజానికి జనసేనతో పొత్తుకు టీడీపీ ఉబలాటపడుతోంది. ఆమధ్య పవన్ ను చంద్రబాబు కలిసిన తర్వాత పొత్తు వార్తలు ఎక్కువయ్యాయి. అయితే.. మోడీతో పవన్ భేటీ తర్వాత సీన్ మారిపోయిందనే వార్తలు వచ్చాయి. టీడీపీ, జనసేన కలిసే ప్రసక్తే లేదని.. పొత్తు తమతోనే ఉందని బీజేపీ నేతలు కామెంట్ చేశారు. వైసీపీ సర్కార్ బీజేపీతో రాసుకుపూసుకు తిరుగుతుండడం పవన్ కు నచ్చడం లేదు. బీజేపీ నేతలు మాత్రం జగన్ తమకు శత్రువే అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానితో భేటీ అంశాలను రహస్యంగా ఉంచిన జనసేనాని.. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతున్న ఈ టైమ్ లో నారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారా? అనే అనుమానం కొందరికి కలుగుతోంది. ఎందుకంటే.. మొదట్నుంచి చంద్రబాబుతో వామపక్షాలు సఖ్యతగా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణ టీడీపీ, జనసేనను కలిపే బాధ్యతను బుజానికెత్తుకున్నారనే వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.