Advertisement
కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. రెండు రోజులపాటు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. మొదటిరోజు అంతా ప్రశాంతంగా సాగిన సోదాలు.. రెండో రోజు కాస్త ఉద్రిక్తతకు దారితీశాయి.
Advertisement
బుధవారం ఐటీ రెయిడ్స్ కు ముందు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి గుండెపోటు అంటూ పడిపోయారు. వెంటనే ఆయన్ను సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. కుమారుడ్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు మల్లారెడ్డి. అయితే.. ఆయన్ను అధికారులు వదల్లేదు. వెంటే ఉన్నారు. దీంతో తీవ్ర అసహనానికి లోనయిన ఆయన.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ ఐటీ రెయిడ్స్ రాజకీయ కక్షతోనే చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన కుమారుడిని కొట్టి ఉంటారని, భయపెట్టారని ఐటీ అధికారులపై ఆరోపణలు చేశారు.
Advertisement
ఐటీ అధికారుల సోదాలు ముగింపు దశకు చేరుకున్నాయన్న మల్లారెడ్డి.. కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల విషయంలో ఎలాంటి అవకతవకలు లేవని న్యాయబద్ధంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని అనుమతులతోనే నిర్వహిస్తున్నామన్నారు. తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని తెలిపారు. కానీ, ఆయన చెబుతున్న దానికి ఐటీ వర్గాలు చెబుతున్న దానికి చాలా వ్యత్యాసం కనబడుతోంది.
ఈ సోదాల్లో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు ఆధారాలు సేకరించారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్ గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు వెల్లడించారు. విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. పైగా ఈ సోదాల్లో రూ.8 కోట్ల నగదు, బంగారం సహా పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.