Advertisement
గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సర్వేలన్నీ అనుకూలంగానే ఉన్నా ఛాన్స్ తీసుకోకూడదని బీజేపీ పెద్దలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 1995 నుంచి వరుసగా ఇక్కడ బీజేపీ గెలుస్తోంది. 1998, 2002, 2007, 2012, 2017 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది. అయితే.. కలవరపెడుతున్న అంశం ఏంటంటే.. వరుసగా సీట్ల శాతం తగ్గిపోతూ వస్తోంది.
Advertisement
1995- బీజేపీ(121), కాంగ్రెస్ (45)
1998- బీజేపీ(117), కాంగ్రెస్ (53)
2002- బీజేపీ(127), కాంగ్రెస్ (51)
2007- బీజేపీ(117), కాంగ్రెస్ (59)
2012- బీజేపీ(115), కాంగ్రెస్ (61)
2017- బీజేపీ(99), కాంగ్రెస్ (78)
ఇలా బీజేపీకి సీట్లు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రధాని అయ్యాక జరిగిన 2017 ఎన్నికల్లో ఓట్ల పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ బలం పుంజుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 49.1 శాతం ఓట్లు పడగా.. కాంగ్రెస్ కు 41.4 శాతం వచ్చాయి. ఈసారి పక్కాగా గెలుపు తమదేనని హస్తం నేతలు తెగ కష్టపడుతున్నారు. అయితే.. ప్రధాని మోడీ ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. జిల్లాల పర్యటనలు చేపట్టారు.
Advertisement
తాజాగా అరవల్లి జిల్లా, బనస్కాంత జిల్లాల్లో పర్యటించారు మోడీ. ప్రజలకు పాత విషయాలన్నీ గుర్తు చేస్తూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బనస్కాంత జిల్లా పాలన్ పూర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. గుజరాత్ లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నారు. తాను ఇక్కడే పెరిగాను కాబట్టి మీ సమస్యలను చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. అంటే.. తనకు అన్నీ తెలుసని.. అంతా చూసుకుంటాననే భరోసాని ప్రజల్లో కలిగేలా చేస్తున్నారు.
అరవల్లి జిల్లాలోని మోడస టౌన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు మోడీ. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి కాంగ్రెస్ వత్తాసు పాడుతూ తాము కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో పొందిపరిచిందని గుర్తు చేశారు. కానీ, తాను మాత్రం ఇళ్ల మిద్దెలపై సోలార్ రూఫ్ లతో విద్యుత్ ఉత్పత్తి చేసి మిగులు విద్యుత్ తో గుజరాతీలు డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి విద్యుత్ అడిగినందుకు రైతులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు విద్యుత్ ను సోలార్ ప్యానెళ్ల ద్వారా వారే ఉత్పత్తి చేసుకుని మిగులు విద్యుత్ అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారని చెప్పారు మోడీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో డిసెంబర్ 1, 5న జరగనున్నాయి. కౌంటింగ్ డిసెంబర్ 8న జరగనుంది.