Advertisement
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సిట్ కు బ్రేక్ పడింది. బీజేపీ కీలక నేతను విచారణ చేద్దామని తహతహలాడిన అధికారులకు హైకోర్టు షాకిచ్చింది. బీఎల్ సంతోష్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై డిసెంబర్ 5 వరకు స్టే విధించింది. దీంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Advertisement
ముగ్గురు నిందితుల ఆడియోలు, వీడియోల్లో చెప్పిన దాన్ని ప్రకారంగా బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు కేరళకు చెందిన జగ్గు స్వామి, తుషార్ కు నోటీసులు పంపారు సిట్ అధికారులు. అలాగే న్యాయవాది శ్రీనివాస్ కు పంపించారు. నలుగురిలో శ్రీనివాస్ ఒక్కరే రెండు రోజులపాటు విచారణకు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురు రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన సిట్ జరిగిందంతా వివరించింది. బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు పంపాలని ఆదేశించింది. అధికారులు న్యాయస్థానం ఆదేశాలతో వాట్సాప్, మెయిల్ ద్వారా రెండోసారి నోటీసులు పంపారు. రెండు డేట్స్ చెప్పి ఏ రోజు వస్తారో చెప్పాలన్నారు.
Advertisement
అయితే.. బీఎల్ సంతోష్ అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించారు. సిట్ నోటీసులు రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఎలా ఇస్తారని సంతోష్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ వాదనలు వినిపించారు. ఫాంహౌస్ కేసులో ఆయన అనుమానితుడు కాదని.. నిందితుడు కూడా కాదన్నారు. పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిట్ పై నమ్మకం లేదన్నారు. నోటీసుల పేర్లతో బీఎల్ ని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ ఈ కేసు విచారణలో కలుగజేసుకున్నారని వాదించారు.
వాదనల అనంతరం సిట్ నోటీసులు చట్టపరంగా లేవని పేర్కొంది హైకోర్టు. నోటీసులపై డిసెంబర్ 5 వరకు స్టే విధించింది. విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. మరోవైపు సిట్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతకుముందే బీఎల్ సంతోష్ తోపాటు తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ను నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.