Advertisement
రేవంత్ రెడ్డితో పడక సీనియర్లు కాంగ్రెస్ ను వీడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారు సైతం గుడ్ బై చెబుతున్నారు. మరికొంతమంది పార్టీని వదిలేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ రంగంలోకి దిగింది. వెళ్తూ వెళ్తూ రేవంత్ ని అంతలా ఎందుకు తిడుతున్నారన్న దానిపై ఫోకస్ పెట్టింది. నిజంగా ఆయన ఒంటెద్దు పోకడలతో.. సీనియర్లను కలుపుకొని పోవడం లేదా? అనే విషయాలపై ఆరా తీయడం మొదలు పెట్టిందట. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.
Advertisement
ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు పార్టీ పెద్దలు. పరిస్థితిపై సమాలోచనలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే రేవంత్ వన్ మ్యాన్ షో కాకుండా… రెండు, మూడు రకాల కమిటీలను నియమించాలని చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేగనక నిజమైతే.. రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. అయితే.. రేవంత్ అధ్యక్ష పదవికి ఢోకా లేకుండా.. అధికారాలు మాత్రం నామమాత్రంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.
Advertisement
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నా.. నిర్ణయాధికారం, కార్యాచరణ అంతా ఇకపై ప్రియాంకా గాంధీ చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ కు భారీ అంచనాల నడుమ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు హైకమాండ్ అప్పగించింది. కానీ, ఆయన అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఉప ఎన్నికల్లో వరుసగా డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. దీనికి తోడు సీనియర్లంతా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. రేవంత్ పై ఒకరి తర్వాత ఒకరు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన్ను కొనసాగిస్తూనే తామే నేరుగా తెలంగాణ వ్యవహారాలపైన దృష్టి పెట్టాలని అధిష్టానం డిసైడ్ అయిందట. వచ్చే నెలలో ప్రియాంకా గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నట్లు సమాచారం. పార్టీలో నియామకాలు పూర్తయిన వెంటనే.. కార్యవర్గంతో ఆమె సమావేశం అవుతారట.
మరోవైపు రేవంత్ పై సీనియర్లకు ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో ఉంది బీజేపీ. నెమ్మదిగా ఒక్కొక్కరిని తనవైపు లాగుతోంది. అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీని ఖాళీ చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. త్వరలో మర్రి శశిధర్ రెడ్డి బాటలోనే మరికొందరు నేతలు కాంగ్రెస్ ను వీడతారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ.. హస్తం నేతలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. జిల్లాల్లోని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మునుగోడు ఫలితం అనుకూలంగా ఉంటే వలసల ప్రవాహం అధికంగా ఉండేది. అక్కడ రివర్స్ కొట్టినా కూడా వచ్చిన సెకెండ్ పొజిషన్ ను, ఓట్లను వివరిస్తూ.. తమవైపు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా.. రేవంత్ అంటే పడని నేతలను ఒక్కొక్కరిగా చేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తోందని అంటున్నారు.