Advertisement
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఇప్పటికే నాలుగు విడతల్లో యాత్రను ముగించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఐదో విడత కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ, పోలీసులు చివరి నిమిషయంలో షాకిచ్చారు. అనుమతి లేదని బండిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ లోని తన ఇంటికి తరలించారు.
Advertisement
పాదయాత్రను ప్రభుత్వం కావాలని అడ్డుకుంటోందని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తొలుత హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావించినా అది కుదరకపోవడంతో బీజేపీ తరఫు న్యాయవాది ఫస్ట్ కాల్ లిస్ట్ లో మెన్షన్ చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. పాదయాత్రకు ఓకే చెప్పింది. కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. బైంసా పట్టణంలోకి యాత్రకు అనుమతి ఉందా అని ప్రశ్నించగా.. లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తెలిపారు.
Advertisement
పట్టణంలోకి అనుమతి లేనప్పుడు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు న్యాయమూర్తులు. భైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలని స్పష్టం చేసింది. సిటీలోకి వెళ్లకుండా యాత్ర కొనసాగించాలని చెప్పింది హైకోర్టు. బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. లాస్ట్ మినిట్ లో నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలో జరిగిన సీన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అయింది.
ప్రభుత్వం కక్షపూరితంగా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూసిందని, చివరకు కోర్టులో న్యాయం జరిగిందని బీజేపీ నేతలు అన్నారు. ఐదో విడత పాదయాత్రను సోమవారం భైంసా నుంచి ప్రారంభించాలని బీజేపీ ముందుగా రూట్ మ్యాప్ ఫిక్స్ చేసుకుంది. భైంసా నుంచి కరీంనగర్ వరకు యాత్రకు ప్లాన్ చేసింది. మొత్తం 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర.. 5 జిల్లాలు, 3 పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొనసాగేలా అంతా సిద్ధం చేశారు కమలనాథులు.