Advertisement
సీఎం కేసీఆర్ ముందస్తు రాగాలు అందుకున్న నేపథ్యంలో బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో జనం మధ్యనే ఉంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా.. ముథోల్ నియోజకవర్గంలోని కుంటల మండలం అంబకంటిలో మాట్లాడుతూ.. 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు వస్తాయని, బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
Advertisement
ఐదోరోజు యాత్రలో భాగంగా ముందుగా నర్సాపూర్ లో రచ్చబండ నిర్వహించారు ప్రజలు ఈ సందర్భంగా వారి బాధలన్నీ బండికి వివరించారు. ప్రభుత్వంపై బీజేపీ పోరాటం సాగిస్తుందని అందరూ అండగా నిలబడాలని సంజయ్ కోరారు. ఆ తర్వాత నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. నర్సాపూర్ మండలంలోని బాంనీ, నందన్ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. రైతుబీమా రాలేదని ఓ వితంతువు, రుణమాఫీ కాలేదని, 24 గంటల ఉచిత కరెంట్ రావడం లేదని రైతులు బండికి వివరించారు.
Advertisement
ఓ బీడీ కార్మికురాలు తనకు పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిందని సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పుకునే మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదని మండిపడ్డారు. ఆ తర్వాత నందన్ గ్రామస్థులతో రచ్చబండ జరిగింది. స్థానికులు అనేక సమస్యలు ప్రస్తావించారు. తమకు రైతు బీమా అందలేదని పలువురు వితంతువులు, ఇండ్లు లేవంటూ కొందరు మహిళలు, రోడ్డు లేదని ఓ పెద్దాయన, పెన్షన్ రావడం లేదని ఓ ముసలావిడా ఇలా ఎవరిని కదిలించినా సమస్యలే ఏకరువు పెట్టారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకొచ్చాక అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని వారికి భరోసానిచ్చారు బండి సంజయ్.
ఇక రాంపూర్ బైపాస్ దగ్గర జరిగిన కార్నర్ మీటింగ్ లో బండి మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీని మూసివేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. అందుకనే విద్యార్థులను కావాలని టార్గెట్ చేసి వేధిస్తోందని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ దొంగ హామీ ఇచ్చారన్నారు. రైతులకు రుణ మాఫీ చేయలేదని.. నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదని.. నోటిఫికేషన్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన భూముల చిట్టా అంతా తమ దగ్గర ఉందని బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వాటాలు పెట్టడానికి కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బండి ప్రశ్నించారు.