Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు యమ స్పీడ్ మీదున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అరెస్టులు, నోటీసులు, సోదాలు జరుపుతూ హడావుడి చేస్తున్నాయి. అయితే.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించాక.. రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
ఈ కేసులో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కవితకు సీబీఐ నుంచి పిలుపువచ్చింది. ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో చెప్పాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది.
Advertisement
సీబీఐ నుంచి తనకు నోటీసులు అందినట్టు కవిత ధ్రువీకరించారు. ఈనెల 6న హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని తెలిపినట్టు వెల్లడించారు. అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించిన వెంటనే మీడియా ముందుకొచ్చారామె. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. ఈ కేసులో దేనికైనా రెడీ.. అరెస్ట్ కైనా సిద్ధమని స్పష్టం చేశారు.
కవిత ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే సీబీఐ నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కాంలో మొదట్నుంచి కవిత పేరు వినిపిస్తోంది. బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆమెపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఇదంతా తప్పుడు ప్రచారమని కోర్టుకు వెళ్లి మరీ తనపై ఎవరూ నిరాధారమైన నిందలు వేయకూడదని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే.. అటు ఇడీ, ఇటు సీబీఐ ఈ కేసులో దూకుడుగా దర్యాప్తు కొనసాగించాయి. ఈ క్రమంలోనే కవితతో సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న అభిషేక్ రావు, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. దీంతో కవితకు ఉచ్చు బిగుస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీబీఐ నుంచి పిలుపు అందింది. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.