Advertisement
ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం నేపథ్యంలో నాయకుల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటీ పడి మరీ తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ పలు ఇష్యూలపై ప్రశ్నలను లేవనెత్తారు. కేసీఆర్ చెప్పే బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేది కాదన్నారు. ఇది ఆయనకి కూడా తెలుసని చురకలంటించారు. అయితే, టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ కాబట్టి, పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుందనే భ్రమతో ప్రాంతేతర పార్టీలు కొన్ని ఈ పరిస్థితిని తమకు అవకాశంగా భావించి తెలంగాణలో పనిచెయ్యటమే కేసీఆర్ కి అవసరమన్నారు.
Advertisement
ఈ కొత్త పరిణామాలు మరోసారి తెలంగాణవాద ప్రజా ఓటు బ్యాంకును “మా దశాబ్దాల పోరాట తెలంగాణపై మళ్లీ ఈ ప్రాంతేతర పార్టీల దాడి ఏంది? ఆక్రమణ ప్రయత్నమేంది?” అనే ఆక్రోశంతో టీఆర్ఎస్ వైపు పెద్దఎత్తున మళ్లించడమే సీఎం వ్యూహంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి రోజువారీ సంఘటనలు అందుకు దారి తీసేటట్లుగానే నడుస్తున్నట్లు ఉన్నాయన్నారు. దశాబ్దాల కాలపు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఎందరో తన తోటి ఉద్యమకారులు ఇదే అభిప్రాయాన్ని తనతో పంచుకున్నట్లు తెలిపారు.
Advertisement
మరోవైపు మహిళల గౌరవంపైనా కేసీఆర్ ను టార్గెట్ చేశారు విజయశాంతి. రాష్ట్ర గవర్నర్ గా ఉన్న మహిళనే లెక్క చేయని కేసీఆర్.. సాధారణ మహిళల పట్ల ఏవిధంగా గౌరవంగా ఉండగలరని ఎద్దేవ చేశారు. ఇంఛార్జి మేనేజర్ గా ఉన్న ఓ మహిళా అధికారి నిజామాబాద్ జిల్లా మామిడి క్వారీకి చెందిన సమాచారాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తుదారుడికి ఇచ్చిందని.. ఆ సమాచారాన్ని ఇచ్చినందుకు ఆగ్రహించి ఆమెను బాధ్యతల నుంచి తొలగించారని మండిపడ్డారు.
తనకు న్యాయం చేయాలని ఆమె సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళినా పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు విజయశాంతి. మహిళలంటే కేసీఆర్ కు ఎంత గౌరవముందో ఈ సంఘటనతో బహిర్గతమయ్యిందన్నారు. ఆర్టీఐ కింద సమాచారాన్ని ఇచ్చిందనే కారణంతో మహిళను ఏడేళ్లుగా వేధించడమే కాకుండా రెండున్నరేళ్లుగా జీతం కూడా ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని ఫైరయ్యారు. చివరికి బాధితురాలు వీఆర్ఎస్ అడిగినా ఇవ్వకుండా నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఈ సమస్యపై మహిళా కమీషన్ కు నివేదించినా దిక్కు లేకుండా పోయిందన్నారు.