Advertisement
హైదరాబాద్ లో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఫ్యామిలీతో వాహనంలో బయటకు వెళ్తే.. అదే సమయంలో భారీ వర్షం పడితే అంతే. కొన్ని చోట్ల ఎక్కడ రోడ్డు ఉందో.. ఏది గొయ్యో తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఏరియాల్లో ప్రయాణం అంటే యముడికి వెల్ కమ్ చెప్పడమే. ఈ దుస్థితికి నాలాల నిర్వహణా లోపమే కారణమనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై సరైన దృష్టి సారించకపోవడం వల్లే వర్షాకాలం సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు, ప్రతిపక్షాలు తిట్టిపోస్తుంటారు.
Advertisement
అయితే.. టీఆర్ఎస్ సర్కార్ నాలాలను బాగు చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే.. ఈసారి మాత్రం పక్కా అని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలాల పనులు రెండు నెలల్లో పూర్తి అవుతాయని తెలిపారు. వర్షాకాలం నాటికి మొదటి దశ పనులు మొత్తం పూర్తి చేసి ముంపు సమస్య తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రతీ వర్షాకాలంలో నాలాలు ఉప్పొంగడం.. కాలనీలు మునిగిపోవడం.. రోడ్లపై నీళ్లు నిలబడడం జరుగుతున్నదే. వాటిపై దృష్టి సారించామని అంటున్నారు కేటీఆర్.
Advertisement
హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా పచ్చదనం కనిపిస్తోందని.. ఊకదంపుడు ఉపన్యాసాలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, చిత్ర విచిత్ర బట్టలు వేసుకుంటే అభివృద్ది కాలేదని మోడీకి ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారు. కేసీఆర్ ముందుచూపు, చిత్తశుద్దితో డెవలప్ మెంట్ సాధ్యం అయిందని వ్యాఖ్యానించారు. 240 కోట్ల మొక్కలతో రాష్ట్రమంతా హరితహారంగా మార్చామన్నారు. రాష్ట్రంలో 7.7 శాతం వృద్దితో 31.7 శాతం గ్రీన్ కవర్ అయిందని వెల్లడించారు కేటీఆర్.
ఇక మళ్లీ తిరిగి కేసీఆరే సీఎం అవుతారని..టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత మెట్రో రెండో ఫేజ్ కింద నాగోల్ టూ ఎల్బీ నగర్ లైన్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు తీసుకువస్తామని తెలిపారు కేటీఆర్.