Advertisement
తెలంగాణ, ఏపీ విడిపోయి ఎన్నో ఏళ్లయింది. ఎవరి గోల వారిది అన్నట్టుగా రెండు రాష్ట్రాల్లో పాలన సాగుతోంది. కొన్ని విషయాల్లో పంచాయితీలు ఉన్నా.. ఏపీ, తెలంగాణ ఇప్పుడు వేర్వేరు. కలిసే ఛాన్సే లేదు. అధికారికంగా ఇది అన్నీ అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అసంబద్దమని సుప్రీంలో కేసు ఉందన్నారు. అంతటితో ఆగకుండా ఏపీ ఉమ్మడిగా కలిసి వుండాలన్నదే వైసీపీ విధానమని చెప్పారు. సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
Advertisement
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. లిక్కర్ స్కాంను పక్కదారి పట్టించే ప్లాన్ లో భాగంగానే సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఏపీ నేతలతో కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కూతురు రూ.లక్ష కోట్ల మద్యం దందా చేశారని.. ఇద్దరు సీఎంలు కలిసి నాటకాలాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని, అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు బండి.
Advertisement
ఇక సజ్జల వ్యాఖ్యలపై వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ఘాటైన రిప్లై ఇచ్చారు. ఇవి అర్థం లేనివని ఫైరయ్యారు. నేడు తెలంగాణ ఒక వాస్తవమని.. ఎంతోమంది బలిదానాలు, త్యాగాల మీద ఏర్పడిందని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలవడమనేది అసాధ్యమన్న ఆమె.. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని చెప్పారు. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదని, మీ ప్రాంత అభివృద్ధి మీదంటూ సజ్జలకు గట్టి కౌంటరే ఇచ్చారు షర్మిల.
ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై స్పందించారు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలిసేందుకు అవకాశం లేదన్నారు. పార్లమెంట్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో అంతా జరి గిందని.. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు ఉంటే.. ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చన్నారు. అంతేగానీ, మళ్లీ తెలుగు రాష్ట్రాలు కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
నిజానికి తెలంగాణ ఏర్పాటుపై అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటన చేసింది. వాటిలో వైసీపీ కూడా ఉంది. కానీ, ఇన్నాళ్లకు సజ్జల తాము ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు అని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. కొందరు నేతలు దీన్ని కుట్రగా భావిస్తుంటే.. మరికొందరు డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెందిన పెద్దల హస్తం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని చెబుతున్నారు.